ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ‌రెడ్డి ఆస‌క్తికరంగా విశ్లేషించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెంది బలమైన అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయ‌న ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆరేళ్లలో టీఆర్ఎస్‌ పాలనలో రాజ్యాంగాన్ని పదేపదే అవమానిస్తూ తెలంగాణకు కేసీఆర్‌ చెడ్డపేరు తెచ్చార‌ని ఆరోపించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల కొనుగోలు చేసే సంస్కృతిని చట్టబద్ధం చేసిన ఘనత కేసీఆర్‌దే అని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ‌రెడ్డి విరుచుకుప‌డ్డారు.

మొదటిసారి గెలిచినప్పుడు ప్రతిపక్షానికి చెంది 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలను కొనుగోలు చేశార‌ని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ‌రెడ్డి ఆరోపించారు. రెండవసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా 12 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించాడ‌ని మండిప‌డ్డారు. అధికార పార్టీ ఎన్నికైన ప్రతినిధులనే కాకుండా, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కూడా వేటాడుతోందని అన్నారు. తెరాస కుట్రలను ఎదిరించి మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలిచే సత్తా కాంగ్రెస్ శ్రేణులకు ఉందని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మున్సిపాల్టీ  ఎన్నికల్లో మెజారిటీ వార్డులల్లో, డివిజన్లల్లో కాంగ్రెస్‌ జండా ఎగురుతుందని గూడూరి నారాయ‌ణ‌రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అభ్యర్ధులకే ప్రజలు ఓటు వేస్తారని ఆయ‌న పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య విలువలను భ్రష్టుపట్టిస్తోంది టీఆర్‌ఎస్‌, ప్రజలే పాఠం చెబుతారని వెల్ల‌డించారు. 

 

కాగా, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషనల్ ప్రక్రియ ముగిసింది... టికెట్లు ఆశించేవారు కొందరు బీఫారమ్‌ తీసుకుని నామినేషన్లు వేస్తే.. మరికొందరు రెబల్స్‌గా బరిలోకి దిగారు. అయితే, నేతలు టికెట్లను అమ్ముకుంటున్నారటే చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది. కార్పొరేషన్ మేయర్ పదవి, మున్సిపాలిటీ చైర్మన్ పోస్టులు కోట్లల్లో పలుకుతుంటే.. కార్పొరేటర్, కౌన్సిలర్ టికెట్లు రూ.50 లక్షల వరకు పలుకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: