టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతి కోసం పోరాడుతున్నారు. పార్టీని, కార్యకర్తలను అందుకు ఉపయోగిస్తున్నారు. తాను స్వయంగా రాజధాని ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల్లోనూ పర్యటనలు చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని మార్చొద్దంటూ ఈనాడు పత్రిక కూడా రోజూ ప్రత్యేక కథనాలు ఇస్తోంది. దీనిపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.

 

మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ నేరుగా ఈనాడుపై విమర్శలు గుప్పించారు. ఈనాడు పాత కథనాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తీరును ఎండగట్టారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో నేత దాడి వీరభద్రరావు ఈనాడు యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

 

ఆయన ఏమ్నారంటే.. “ ఓ పత్రికాధిపతిని కోరుతున్నాను. ఏడు భవనాలను పేపర్‌లో వేసి మొత్తం అయిపోయినట్లుగా చెప్పడం ప్రజలను మోసం చేయడం కాదా..? విశాఖపట్నం కాదని అంత భుజాన ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటీ..? మీ పేపర్‌ను మొదటిసారిగా విశాఖపట్నంలో పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖలోనే పెట్టారు. ఇక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించారు. మీ ఎదుగుదలకు కారణం విశాఖ. మీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో సభ్యులం, మీ ప్రియా పచ్చళ్లు తింటున్నాం. మీకు మేము చేసిన అపకారం ఏంటీ..? అని ప్రశ్నించారు.

 

" ఇన్నాళ్లకు ఒక సెక్రటేరియట్‌ ఇస్తానని ప్రతిపాదిస్తే.. నిర్ణయం రాకముందే ఎందుకు హైరానా పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టడం మోసం చేయడం కాదా..? దయచేసి చంద్రబాబు ప్రయోజనాల కోసం ఇంకా మీ పేపర్‌ పనిచేసేలా చూడకండి.. రాష్ట్ర ప్రయోజనాలు చూడండి. ఈ రాష్ట్రంలో మీము కూడా భాగస్వాములమే.. రాయలసీమ వారు కూడా భాగస్వాములే. అందరూ ఈనాడు పేపర్‌ను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను మీరు వ్యతిరేకిస్తూ.. మీ పేపర్‌ దాని కోసం పనిచేస్తే దాన్ని ఎవరూ హర్షించరని, మీ పేపర్, మీ టీవీల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

 

" చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఇంకా కుళ్లు రాజకీయాలు ఎందుకండి. చంద్రబాబును పట్టుకొని ఏడుస్తారేంటీ.. అప్రతిష్టపాలైన నాయకుడిని వెంటపడాల్సిన అవసరం మీకు ఏమోచ్చింది.. ఆయనతో పాటు మీరు మునిగిపోవడానికా..న్యాయబద్ధంగా, వాస్తవాలు రాసే విధంగా సూచనలు చేయాలని కోరుతున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: