భార‌తీయ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్ అక్ర‌మాల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచిన చందా ఇప్పుడు తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్నారు. వీడియోకాన్ గ్రూపున‌కు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో చందా కొచ్చార్ రుణాలు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చందా కొచ్చార్ భ‌ర్త కంపెనీలో క్విడ్ ప్రోకో ప‌ద్ధ‌తిలో 64 కోట్ల పెట్టుబ‌డి జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో ఈడీ అధికారులు కొచ్చార్ నివాసంలో సోదాలు కూడా చేశారు. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో తాజాగా ఆమెకు చెందిన 78 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. 2017లో ఫార్చూన్ మ్యాగ్జిన్ శక్తివంతమైన మహిళల జాబితాలో చందా కొచ్చార్ పేరును వెల్లడించిన విషయం తెలిసిందే.

 


మ‌నీ లాండ‌రింగ్‌ కేసులో కొచ్చార్ భ‌ర్త దీప‌క్‌ను కూడా గ‌తంలో విచారించారు. ముంబై అధికారులు వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చందా కొచ్చార్ మేన‌ల్లుడు రాజీవ్ కొచ్చార్‌ను కూడా ముంబై, ఢిల్లీ న‌గ‌రాల్లో ప్ర‌శ్నించారు. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈడీ విచార‌ణ చేప‌ట్టింది. దీని ప్ర‌కారం,  ముంబైలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను ఈ కేసులో అటాచ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ ఇంట్లో చందా నివ‌సించే హ‌క్కు ఉంద‌ని ఆమె త‌రపున న్యాయ‌వాది కాంటావాలా తెలిపారు. కానీ ఆ ఇంటిని అమ్మ‌డం కానీ మార్టిగేజ్ చేయ‌డం కుద‌ర‌దు.

 

 

 

కాగా, వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ పాల్ప‌డిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ షిక్కా శర్మాలకు సమన్లు జారీ చేశారు. యాంటీ ఫ్రాడ్ ఏజెన్సీ ఈ సమన్లు జారీ చేసింది. పీఎన్‌బీలో జ‌రిగిన 13వేల కోట్ల స్కామ్‌కు సంబంధించి ఈ స‌మ‌న్లు జారీ చేశారు. నీరవ్ మోదీకి సంబంధించిన గీతాంజలి జ్వలర్స్‌కు రుణాలు జారీ చేసిన కేసులో కొచ్చార్‌ను విచారించారు.

 

ఇలా షాకుల ప‌రంప‌ర అనంత‌రం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్ చందా కొచ్చార్ రాజీనామా చేశారు. బ్యాంక్ బోర్డు ఆమె రాజీనామాను అంగీకరించింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని కొచ్చార్.. బ్యాంక్ బోర్డును కోరింది. దానికి తగినట్లుగానే ఆమెకు అనుమతి లభించింది. రాజీనామా చేసిన చందా కొచ్చార్ స్థానంలో బ్యాంక్ నూతన డైరక్టర్‌గా సందీప్ భక్షిని నియమించారు. 2023, అక్టోబర్ 3 వరకు సందీప్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: