ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని విష‌యంలో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డేందుకు ముఖ్య‌మైన ఘ‌ట్టం జ‌ర‌గ‌నుంది. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి... రాజధానిని తరలించ వద్దంటూ రోడ్డెక్కిన రైతులు... నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.  ఏప్రిల్ 6 నుంచి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. 

 

అధికార వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యంలో భాగంగా, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని  అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూనే, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ వేసిన ఏపీ ప్ర‌భుత్వం దీనికి తోడుగా, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్ నివేదికను సైతం తీసుకుంది. ఈ మూడింటినీ స‌మ‌గ్రంగా చ‌ర్చించి, తుది ప్ర‌తిపాద‌న‌లు అందించేందుకు హై పవర్‌ కమిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలో వివిధ క‌మిటీలు, వాటి నివేదిక‌లు, ప్ర‌తిపాద‌న‌లు, హైప‌వ‌ర్ క‌మిటీ నివేదికను చ‌ర్చించేందుకు ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు నిర్ణ‌యించ‌నున్న‌ట్లు స‌మాచారం. 

 

ఈ నెల 18న కేబినెట్‌ భేటీ కానుంది. ఈ స‌మావేశం అనంత‌రం 20వ తేదీన ప్రభుత్వం అసెంబ్లీ స‌మావేశాల‌ను ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో రాజధాని సహా రాష‍్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ఓ వైపు కేబినెట్ స‌మావేశం, అనంత‌రం వెంట‌నే అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ఈ రెండు స‌మావేశాల్లో చ‌ర్చించే అంశాల‌పై ఉత్కంఠ నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: