తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొత్త  వివాదం-ప‌రిష్కారం సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో తెర‌మీద‌కు వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ ఈనెల 13న హైదరాబాద్‌లో సమావేశం కానున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తాజా రాజకీయాలపై చ‌ర్చించ‌నున్నార‌ని స‌మాచారం. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తదితర అంశాలు- వాటి పరిష్కారంపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశముంది.  వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది.  అయితే, దీని ఆధారంగానే కొత్త అంశం కాంగ్రెస్ పార్టీ తెర‌మీద‌కు తెచ్చింది. 

 

కాంగ్రెస్ పార్టీ కార్యాల‌య‌మైన గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో పార్టీ నేత‌లు, మర్రి శశిధర్ రెడ్డి, కత్తి వెంకటస్వామి, బెల్లయ్య నాయక్ మీడియాతో మాట్లాడుతూ 13వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ భేటీ అవుతున్నట్టు తెలిసిందని అయితే, ఈ స‌మావేశంపై అనేక అభ్యంత‌రాలు ఉన్నాయ‌న్నారు. మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ,  ``ఇటీవల ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ప్ర‌స్తుత‌మున్న దానికి మించి రెట్టింపు స్థాయిలో తరలించే ప్రయత్నం చేస్తాం అని ప్ర‌క‌టించారు. గతంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌పుడు పోతిరెడ్డిపాడు నుంచి 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తామని ప్రయత్నం చేస్తే నేను, పి.జ‌నార్ధ‌న్‌రెడ్డి కలిసి వ్యతిరేకించాము. ఈ రోజు పీజేఆర్‌ జయంతి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఈ ఇద్ద‌రు సీఎంల స‌మావేశంలో ఇప్పుడు పోతిరెడ్డిపాడు మళ్ళీ చర్చకు వస్తోంది.`` అని అన్నారు. 

 

పోతిరెడ్డిపాడు స్టేటస్ ఏంటి? కేసీఆర్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అని మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు. ``పోతిరెడ్డిపాడు హెడ్ రేగ్యులేటర్ 15 టీఎంసీలను తెలుగు గంగకు తరలించే ఉద్దేశంతో నిర్మించింది. కానీ వైస్సార్ అక్కడ నుంచి నీటిని ఎక్కువగా తరలించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు 44 వేల నుంచి 88 వేల క్యూసెక్కులు తరలించేందుకు మళ్ళీ కుట్ర మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించాలి. లేకపోతే కరువు ప్రాంతాలైన దక్షణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏపీ సీఎం జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయినప్పుడు మొహమాటానికి కాకుండా పోతిరెడ్డి పాడు హెడ్ రేగులేటర్ స్థాయి పెంచడాన్ని తీవ్రంగా ఖండించాలి`` అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత‌ల డిమాండ్ నేప‌థ్యంలో  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్ భేటీపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: