వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు క‌ల‌కంలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వ‌హించిన సంఘీభావ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై పత్రికలో రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ పవర్‌స్టార్‌. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి అన్యాయం జరిగితే జగన్‌ వచ్చి నిరాహార దీక్ష చేశాడు. నువ్వు ఏం చేశావ్‌. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్న నువ్వూ ఒక నాయకుడివేనా. మీ అందరి బట్టలు ఊడదీసే నాయకుడు జగన్‌ వచ్చాడు. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌లను జైల్లో వేయాలి’ అని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.

 

దీనిపై ఇప్ప‌టికే జ‌న‌సేన స్పందించింది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దు అని అన్నారు. ``సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం. ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసిన ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. తప్పుని తప్పు అని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దు. అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానం. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరేది ఒకటే పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలి. మా జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటాను. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలి.పవన్ కల్యాణ్, అధ్యక్షులు, జనసేన`` పేరుతో ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: