కేంద్ర ప్ర‌భుత్వానికి డ‌బ్బుల టెన్ష‌న్ ప‌ట్టుకుంది. వైపు తీవ్ర ఆర్థిక మందగమనం కొనసాగుతుండటం, మరోవైపు గతేడాది కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నిర్దేశించుకొన్న రూ.19.60 కోట్ల లక్షిత రాబడిలో మూడింట ఒక వంతుకుపైగా తగ్గుతుందని మోదీ సర్కారు ఆందోళన చెందుతున్నది. ఆదాయం గణనీయంగా పడిపోవడంతో వ్యయహామీలను నెరవేర్చేందుకు అవసరమైనన్ని నిధుల్లేక కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్నది. ఈ నేపథ్యంలో తమకు తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించి ఆదుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)పై ఒత్తిడి తీసుకురావాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నట్టు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధమున్న అధికార వర్గాలు వెల్లడించాయి. 

 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కేంద్రానికి రూ.1.48 లక్షల కోట్లు సహా మొత్తం రూ. 1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించేందుకు రిజర్వు బ్యాంకు బోర్డు కొన్ని నెలల క్రితమే ఆమోదం తెలిపింది. అయితే దీనికి అదనంగా తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించాల్సిందిగా ఆర్బీఐపై ఒత్తిడి తీసుకురావాని కోరాలని కేంద్రం యోచిస్తున్నది. లాభాల్లో అధిక భాగాన్ని ప్రభుత్వ బాండ్లు, కరెన్సీల ట్రేడింగ్‌ ద్వారా ఆర్జిస్తున్న ఆర్బీఐ.. ఈ సంపాదనలో కొంత మొత్తాన్ని తన సంస్థాగత కార్యకలాపాలకు, తాత్కాలిక అవసరాలకు అట్టిపెట్టుకొని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఆర్బీఐ రూ.1.23 లక్షల కోట్ల మిగులు ఆదాయాన్ని ఆర్జించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సంలో వచ్చిన ఆదాయం కంటే చాలా ఎక్కువ. అయితే మార్చి 31వ తేదీతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 5 శాతానికి క్షీణించి 11 ఏళ్ల‌ కనిష్ఠస్థాయికి పతనమవడం ఖాయమని అనేక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 

 


కాగా, ఈ అప్పు విష‌యంలోనూ కేంద్రం లౌక్యం ప్ర‌ద‌ర్శిస్తోంది.  తాత్కాలిక డివిడెండ్‌ చెల్లింపును నిత్యకృత్యంగా మార్చాలని తాము భావించడంలేదని, కానీ ఈ ఏడాదిని అసాధారణ సంవత్సరంగా పరిగణించి రూ. 35,000 కోట్ల నుంచి రూ.45,000 మేరకు అదనపు డివిడెండ్‌ను చెల్లించాల్సిందిగా ఆర్బీఐపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని ఆ అధికారి చెప్పారు. ఈ ఒత్తిడికి ఆర్బీఐ తలొగ్గితే కేంద్రానికి వరుసగా మూడో ఏడాది తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు అటు కేంద్ర ఆర్థికశాఖ అధికార ప్రతినిధులుగానీ ఇటు ఆర్బీఐ అధికార ప్రతినిధులుగానీ ముందుకు రావడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: