ఏపీలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర‌లో ఈ ప్ర‌తిపాద‌న‌ను స్వాగ‌తిస్తుండ‌గా...ప్ర‌స్తుత‌ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ కోసం ఈ నెల 10న మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ నుంచి మహాత్మాగాంధీ రోడ్డులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో నిర్బంధాలు, పోలీసులను చేధించుకుంటూ ఎంజీ రోడ్డుపైకి  యువతులు వచ్చారు. ఈ ర్యాలీలో దాదాపు 8వేల మంది మహిళలు, యువతులు పాల్గొన్నారు. ఇలా ర్యాలీకి వచ్చిన మహిళలు, యువతులను పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. దీనిపై కొత్త వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌దరు మ‌హిళలు, యువ‌తుల‌ పాస్‌పోర్టులు ర‌ద్దు చేయ‌నున్నార‌నేది ఆ ప్ర‌చారం సారాంశం. అయితే, అలాంటి ప్ర‌తిపాద‌నేదీ లేద‌ని తాజాగా విజ‌య‌వాడ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్ఎస్ శ్రీ‌నివాస‌రావు క్లారిటీ ఇచ్చారు. 

 


రాజధాని అమ‌రావ‌తి రైతులకు మద్దతుగా విజయవాడ ర్యాలీలో పాల్గొన్న మహిళలపై కొత్త ర‌కంగా ఇబ్బందులు పెట్ట‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మొత్తం 4 వేల మంది మహిళలపై కేసులు నమోదయ్యాయని, ర్యాలీలో పాల్గొన్న యువతుల్లో ఎక్కువమంది విదేశాల్లో చదువుకోవాలని రెడీ అవుతున్న వారున్నందున రి భవిష్యత్‌ను లక్ష్యంగా చేసుకుని స‌ద‌రు మ‌హిళ‌ల ఆధార్‌, పాస్‌పోర్ట్‌ నెంబర్లు సేకరించి.. మొత్తం 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని పేర్కొంటూ... ఈ వివరాలను విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి అందించారని...త‌ద్వారా వారి పాస్‌పోర్టులు ర‌ద్దు కానున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

 

 
ఇలా పాస్‌పోర్టులు రాకుండా మ‌రియు పాస్‌పోర్టులు ర‌ద్ద‌య్యేలా టార్గెట్‌ చేస్తూ పోలీసులు కేసులు పెడుతున్నారని జ‌రిగిన ప్ర‌చారంపై విజ‌య‌వాడ పాస్‌పోర్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. పాస్‌పోర్ట్ అధికారి డీఎస్ఎస్ శ్రీ‌నివాస‌రావు ఈ మేర‌కు స్పందిస్తూ, ``పాస్‌పోర్టుల‌ను పాస్‌పోర్టు చ‌ట్టంను అనుస‌రించి మాత్ర‌మే ర‌ద్దు చేయ‌డం జ‌రుగుతుంది. అంతే త‌ప్ప ప్ర‌స్తుత కేసుల రూపంలో కాదు. మీడియాలో జ‌రిగిన ప్ర‌చారం మేర‌కు ఈ వివ‌ర‌ణ ఇస్తున్నాం`` అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: