తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీలకు తగిన సమాధానం ఇవ్వాలన్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ దూసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు.  టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వింగ్‌తో భేటీ అయిన ఆయన... ప్రత్యర్థుల విమర్శలకు హూందాగా సమాధానమివ్వాలని సూచించారు. ఇతర పార్టీలు మతం, కులం అంటూ డివిజన్‌ ఆలోచనతో పనిచేస్తుంటే, తాము మాత్రం విజన్‌తో పనిచేస్తున్నామని చెప్పారు కేటీఆర్.

 

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెబుతున్న బీజేపీకి.. అభ్యర్థులే దొరకడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారంటున్నట్టుగా... అలాంటి బీజేపీని చూసి తానెందుకు భయపడతానని ప్రశ్నించారు. హుజుర్‌ నగర్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితం చూసైనా బీజేపీ నేతలు తీరు మార్చుకోవాలన్నారు. 

 

తెలంగాణ ఏర్పడక ముందు, వేసవికాలంలో ప్రతిరోజూ జలమండలి ఆఫీసు ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళనలు జరిగేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని కేటీఆర్‌ చెప్పారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. మున్సిపాలిటీ లకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. తమ పాలనలో 10 రేట్లు ఎక్కువగా మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చామన్నారు.

 

తిమ్మిని బమ్మి చేయడంలో ప్రత్యర్థి పార్టీలవారు సిద్ధహస్తులని... హూందాగా లెక్కలతో సహా తిప్పికొట్టాలని కేటీఆర్‌ సూచించారు. సోషల్ మీడియా వింగ్‌కు నలుగురు కో ఆర్డినేటర్లను నియమించారు. పార్టీ తరపున సోషల్ మీడియాలో పనిచేసేవారికి.. ఈ కో ఆర్డినేటర్లు సహాయసహాకారాలు అందిస్తారని చెప్పారు. మొత్తానికి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలతో ఎలామెలగాలి.. ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎలా సమాధానం ఇవ్వాలనే దానిపై కొన్ని సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: