వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత మందగమన పరిస్థితుల దృష్ట్యా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని ఆయా సంస్థలు సూచించాయి. ఈ క్ర‌మంలో, ప్రభుత్వ రంగ జనరల్‌ బీమా సంస్థల కోసం రాబోయే బడ్జెట్‌లో మరో విడుత మూలధన సాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థలను ఆర్థికంగా పరిపుష్ఠం చేయాలని భావిస్తున్న కేంద్రం.. రెండోసారి మూలధనాన్ని అందించే వీలున్నది. 

 

ఇప్పటికే నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు రూ.2,500 కోట్ల సాయాన్ని మోదీ సర్కారు చేసింది. అయినప్పటికీ ఈ సంస్థలకు అదనంగా రూ.10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు మూలధన అవసరాలున్నాయి.ఈ క్రమంలో అందుకు తగ్గట్లుగా వచ్చే బడ్జెట్‌లో ప్రకటన ఉండవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా, నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను విలీనం చేసి ఒకే పెద్ద సంస్థగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తున్నది. దీని విలువ రూ.1.2 లక్షల కోట్ల నుంచి 1.5 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. 

 

మార్చి 31, 2017 నాటికి ఈ మూడు సంస్థలు కలిసి 200లకుపైగా ఉత్పత్తులను విక్రయించాయి. మొత్తం ప్రీమియం విలువ రూ.41,461 కోట్లుగా ఉన్నది. మార్కెట్‌లో ఇది సుమారు 35 శాతానికి సమానం. ఈ సంస్థల ఉమ్మడి నికర విలువ రూ.9,243 కోట్లుగా ఉన్నది. వీటిలో దాదాపు 44 వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటికి 6 వేలకుపైగా కార్యాలయాలున్నాయి. ఇక 2017లో ప్రభుత్వ రంగ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: