ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దూకుడుగా అడుగులు వేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యర్థులు ఆర్థిక మూలలను టార్గెట్ చేస్తూ.. పావులు కుదుపుతున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడిన బాధలను ఏమాత్రం మర్చిపోని జగన్.. అందుకు అనుగుణంగానే రిటర్న్ గిఫ్టలు ఇస్తూ వస్తున్నారు.

 

ఇసుక రీచుల ఆదాయాలు, అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్, తెలుగు దేశం ఎంపీల వ్యాపారాలపై కేసులు.. ఇలా ఒక్కో ఆయుధం ప్రయోగిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. దీంతో విపక్షంలో నైరాశ్యం కనిపిస్తోంది. ఆరు నెలల పాలనకే చుక్కలు చూపిస్తున్న ఈ జగన్ ను మరో నాలుగేళ్లు ఎలా తట్టుకోవాలా అన్న నిర్వేదం ప్రత్యర్థులను ఆవరిస్తోంది.

 

అందుకే ఎలాగైనా జగన్ ను కట్టడి చేయకపోతే.. తాము రాజకీయంగా, ఆర్థికంగా కుదేలైపోవడం తప్పదని చంద్రబాబు అండ్‌ కో ఓ అంచనాకు ఇప్పటికే వచ్చేసినట్టు తెలుస్తోంది. దీనికితోడు.. ఎన్నో ఆశలు పెట్టుకున్న జమిలి ఎన్నికల అంశం కూడా తమను కాపాడే పరిస్థితి కనిపించకపోవడం మరికాస్త ఇబ్బంది పెడుతోంది. కనీసం జమిలి ఎన్నికలు వస్తేనైనా ఏదోరకంగా జగన్ ను వదిలించుకోవచ్చని ప్రత్యర్థులు కొన్నాళ్లుగా ఆశలు పెట్టుకున్నాయి.

 

అందుకే చంద్రబాబు కొన్ని రోజుల క్రితం వరకూ కూడా రెండేళ్లలోనే ఎన్నికలు రాబోతున్నాంటూ పసుపు శ్రేణులకు ధైర్యం నూరిపోస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకూ జమిలి ఎన్నికలకు పాజిటివ్ గా ఉన్న బీజేపీ అధిష్ఠానం.. తాజాగా ఎన్నికల వైఫల్యాలు, సీఏఏ వివాదాల నేపథ్యంలో.. జమిలి జోలికి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.

 

అందుకే పసుపు దళం జగన్ తాకిడి తట్టుకోలేక.. చివరకు బీజేపీకి దగ్గరయ్యేందుకు సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. మళ్లీ మోడీ వైపే మొగ్గుతూ ఢిల్లీకి రాయబారాలు పంపుతోంది. సుజనా చౌదరి వంటి అస్మదీయులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవేవీ ఫలించకపోతే జగన్ దూకుడును చంద్రబాబు ఎలా తట్టుకుంటారో.. ఏం చేస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: