భారతీయ జనతా పార్టీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రిగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యతలు స్వీకరించడం, ఒకే వ్యక్తి, ఒకే బాధ్య‌త‌లు అనే ప‌రిణామాల  నేపథ్యంలో షా వారసుడి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు వచ్చేవారం పూర్తిస్థాయి అధ్యక్షునిగా బాధ్యతలు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. అమిత్‌షా నుంచి ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారని విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. నడ్డా ఎన్నికను బీజేపీ సీనియర్‌ నేత రాధా మోహన్‌సింగ్‌ త్వరలో ప్రకటిస్తారని తెలిసింది.

 

అమిత్‌ షా వ్యూహాంతో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అనంత‌రం ఆయ‌న బీజేపీ అధ్య‌క్ష స్థానంతో పాటుగా హోంమంత్రి బాధ్య‌త‌లు కూడా చేప‌ట్టారు. అయితే, గ‌త ఏడాదే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అన్ని రాష్ర్టాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో అమిత్‌ షా సమావేశమై చర్చించారు. అయితే అమిత్‌ షానే మరో ఆరు నెలల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్ల‌డించారు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్‌ షానే మరో ఆరు నెలల పాటు కొనసాగించేందుకు ఓకే చేశారు. అయితే, ప్ర‌స్తుతం ఎన్నిక‌లు ముగియడం, కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా బిజీ అయిపోవ‌డం, త్వ‌ర‌లో మ‌రికొన్ని రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో...అమిత్‌ షా అధ్యక్షుడిగా కొనసాగకుండా నూత‌న అధ్య‌క్షుడిగా న‌డ్డాను నియమిస్తారని స‌మాచారం. 

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డాను నియమిస్తారని వార్తలపై ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. అయితే, ఆయ‌న హ‌యాంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ మంచి ఫ‌లితాలు సాధించినందున, న‌రేంద్ర‌మోదీ-షా ధ్వ‌యం ఇద్ద‌రికీ న‌మ్మినబంటు అనే పేరున్నందున న‌డ్డాను నియ‌మించ‌డం ఖాయ‌మ‌ని కాషాయ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. అందుకే , 20వ తేదీ అంటూ స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని చేర‌వేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: