సుప్రీం కోర్టు నిర్భయ కేసు నిందితుల క్యురేటివ్ పిటిషన్ ను కొట్టివేసింది. నిర్భయ దోషులకు చివరి అవకాశం కూడా ముగిసింది. వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ వేసిన క్యురేటివ్ పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్ ను కొట్టివేసింది. మరో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాకు క్యూరేటివ్ పిటిషన్ వేసుకునే అవకాశం మిగిలి ఉంది. 
 
నిర్భయ దోషులకు చివరిగా రాష్ట్రపతికి క్షమాపణ పెట్టుకునే అవకాశం మాత్రం ఉంది. గత నెలలో అక్షయ సింగ్ రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2018 జులైలో ముగ్గురు నిందితుల రివ్యూ పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. జనవరి 22వ తేదీన నిర్భయ కేసు నిందితులను ఉరి తీయాలని పటియాలా హైకోర్టు జనవరి నెల 7వ తేదీన డెత్ వారంట్ ను జారీ చేసింది. తీహార్ జైలులో ఇప్పటికే నిర్భయ కేసు నిందితులను ఉరి తీయడానికి ఏర్పాట్లు జరిగాయి. 
 
దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ మత్రం తమ వైపు నుండి ఇంకా అవకాశాలు మిగిలి ఉన్నాయని చెబుతున్నారు. మొదటి నుండి నిర్భయ కేసుపై మీడియా, పబ్లిక్ ఒత్తిడి ఉండటం వలనే ప్రభావం పడిందని ఏపీ సింగ్ వ్యాఖ్యలు చేశారు. నిర్భయ తల్లి మాత్రం జనవరి 22వ తేదీన నిర్భయ కేసు నిందితులకు ఉరి వేసిన తరువాతే తమకు ఉపశమనం అని అన్నారు. 
 
నిర్భయ తల్లి ఇద్దరు దోషుల క్యురేటివ్ పిటిషన్ల కొట్టివేతపై సంతోషం వ్యక్తం చేశారు.దోషుల పిటిషన్ల విషయంలో తెలివిగా వ్యవహరించారని కావాలనే ఆలస్యంగా పిటిషన్ వేశారని నిర్భయ తరపు లాయర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్భయకు న్యాయం జరగాలని దేశమంతటా ఎదురు చూస్తోందని చెప్పారు. నిర్భయ కేసు నిందితుల పిటిషన్లను కొట్టివేయటంపై ప్రజల నుండి ఆనందం వ్యక్తం అవుతోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: