ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్నాన్ని ఖరారు చేయబోతున్నాడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. చివరకు ఎల్లో మీడియా పెద్దలతో సహా. కానీ కొన్ని రోజులుగా చంద్రబాబు అనుకూల మీడియాలో అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రయత్నం తుగ్లక్ నిర్ణయం, తప్పుడు నిర్ణయం, అన్యాయం అన్న రీతిలో రోజూ ప్రత్యేక కథనాలు వస్తున్నాయి.

 

చంద్రబాబుకు ఇష్టంలేని.. ఆయన్ను కుదేలు చేసే నిర్ణయాల విషయంలో ఎల్లో మీడియా ఇలా స్పందించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటికే అమరావతికి అన్ని విధాలా రాజధాని సౌకర్యాలు సమకూరాయి. ఇంకా కోట్లకుకోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జగన్ డబ్బు లేదన్న సాకుతో రాజధాని తరలించడం అన్యాయం అని ఎల్లో మీడియా వాదిస్తోంది. అందుకు అనుకూలంగానే ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి.

 

అయితే ఇక్కడే ఎల్లో మీడియా ఓ చిన్న లాజిక్ మర్చిపోతోంది. అమరావతిలో ఇకపై జగన్ సర్కారు కోట్లకు కోట్లు ఖర్చు చేయకపోతే.. అది రాజధానిగా నిలబడలేదు. పోనీ.. పేరుకు రాజధానిగా ఉన్నా.. అభివృద్ధి ఉండదు. అభివృద్ధి ఉండకపోతే.. యువతకు ఉద్యోగాలు రావు. అనేక అనుబంధ రంగాలు అభివృద్ధి చెందవు.. మరి అలాంటప్పుడు అన్నీ ఉన్నాయి కదా.. ఇంకెందుకు రాజధాని మారుస్తున్నారు అన్న వాదనలో పస ఏముంది..? అంటే అభివృద్ధి లేకపోయినా పరవాలేదు. కానీ రాజధాని మాత్రం మార్చొద్దు అని సదరు కథనాలు చెబుతున్నాయా..?

 

హైదరబాద్ కు దీటుగా అమరావతి డెవలప్ కావాలంటే.. లక్ష కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబే చెప్పారు. ఆయన హయాంలో కేవలం 5 వేల కోట్లే ఖర్చు చేశారు. ఇంకా 95 వేల కోట్లు ఖర్చు చేయాలి. అందుకే అంత సొమ్ము నా దగ్గర లేదు కాబట్టి.. విశాఖను రాజధాని చేస్తాను..అక్కడ ఓ పది వేల కోట్లు ఖర్చు చేస్తాను..అప్పుడు విశాఖ కూడా హైదరాబాద్ స్థాయిలో డెవలప్ అవుతుంది. అప్పుడు ఉద్యోగాలు సహా అనేక రంగాలు అభివృద్ధి అవుతాయని అన్నది వైసీపీ సర్కారు వాదన. ఇప్పుడు చెప్పండి.. అభివృద్ధి లేకపోయినా అమరావతే రాజధానిగా ఉండాలనడం కరెక్టా..? అభివృద్ధి కోసం రాజధానిని మార్చడం కరెక్టా..? ప్రజలే ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: