సంక్రాంతి పండుగ స‌మ‌యంలో, అనూహ్యంగా నిర్మ‌ల్ జిల్లా భైంసాలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఓ వ‌ర్గం వారు చేసిన దాడులే అంటూ మ‌రో వ‌ర్గం ఆరోపిస్తోంది. వాద‌న‌లు, ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా...ప‌రిస్థితి అదుపుత‌ప్ప‌డంతో...ఏకంగా ఇంట‌ర్నెట్‌ను ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా మొత్తం నిలిపివేసేంత ప‌రిస్థితి. ఈ ఘ‌ట‌నపై భీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. తాజాగా బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

 


భైంసాలో హిందువులపై కొందరు ముస్లిం మూకలు చేసిన మతపరమైన దాడిపై NIA విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయ‌న పేర్కొన్నారు. ``భైంసాకు చెందిన కొన్ని నేర ముఠాలు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో హిందువులపై భౌతికంగా దాడి చేసి వారి వాహనాలు, ఇళ్ళు తగలబెట్టారు. హిందువుల ఇళ్లు పెద్ద ఎత్తున కాలిపోయాయి. మరింత హింస జరుగుతుందేమోనని స్థానికులు భయపడ్తున్నారు. మత హింస జరిగి 48 గంటలు గడిచినా, హోం మంత్రి కానీ, డీజీపీ కానీ భైంసా ఘటన గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. న్యాయం చేస్తామని కానీ, నేరస్తులను పట్టుకుంటామనీ చెప్పలేదు. కనీసం భైంసాలో పరిస్థితిని అదుపు చేసి శాంతిని స్థాపించడానికి కూడా ప్రయత్నించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇదొక ఉదాహరణ.` అని ఆయ‌న ఆరోపించారు. 

 

పోలీసు ఉన్నతాధికారులపై దాడి జరిగినా కూడా కనీసం వారి మీద చర్యలూ తీసుకోలేదు, బాధ్యులైన వారిని ఇంకా అరెస్టూ చేయలేదని కృష్ణ‌సాగ‌ర్ రావు ఆరోపించారు. ``ఈ ఘ‌ట‌న‌పై స్థానిక హిందువుల నుంచి బీజేపీకి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. పైగా, హిందూ కుటుంబాలకు చెందిన 15 మందికి పైగా బాధితులను పోలీసులు వేధిస్తున్నారు, కొందరిని ఇంకా లాకప్పుల్లో ఉంచారు. ఎందరో హిందువులపై భౌతిక దాడులు, వారి ఆస్తులపై దాడులు చేసిన మూకల విషయంలో పోలీసులు ఇలా పక్షపాతం చూపించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. పోలీసుల వైఖరి ఆమోదయోగ్యం కాదనీ బీజేపీ చెబుతోంది. దీన్ని చూస్తే సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసుల చేతులు కట్టేసి, అసలైన నిందితులను తప్పించడానికి చూస్తున్నారని అర్థమవుతోంది. ఎన్నికల రాజకీయాల కోసం ఒవైసీ సోదరులు, ఎంఐఎం పార్టీని మంచి చేసుకోవడానికే ఆయన ఇదంతా చేస్తున్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించిన బాధితులను వెంటనే విడుదల చేయాలనీ, ఇప్పటి వరకూ జరిగిన విచారణపై స్పష్టమైన వివరణ ఇవ్వాలనీ డీజీపీని బీజేపీ డిమాండ్ చేస్తోంది.`` అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: