సంక్రాంతి పండుగ సందర్బంగా ముగ్గులు వేయడం తెలుగింటి ఆడపడుచుల ఆనవాయితీ . అయితే  మున్సిపల్ ఎన్నికల నేపధ్యం లో ముగ్గుల్ని కూడా అధికార టీఆరెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, తమ పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు  .  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్ లో రెండెకరాల స్థలంలో సుమారు 200 మంది మహిళ టిఆర్ఎస్ కార్యకర్తలు సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తు  ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 

కారు గుర్తు ముగ్గును వీక్షించడానికి పట్టణవాసులు తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేసి అబ్బుర పరిచారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఈ ముగ్గును వేసి మహిళా కార్యకర్తలకు  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు, మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు.  ఈమేరకు  మహిళా కార్యకర్తలను మంత్రి కేటీఆర్ తో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులు అభినందించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం విపరీతంగా ఆకర్షిస్తోంది.

 

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలకు , పది మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న  విషయం తెల్సిందే . ప్రచారపర్వం లో దూసుకువెళ్తోన్న టీఆరెస్ నాయకత్వం , ఈ ఎన్నికల్లో ఇప్పటికే అధికార టీఆరెస్ చెన్నూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది . అత్యధిక మున్సిపాలిటీలు , కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ  నాయకత్వం అడుగులు వేస్తోంది . అయితే ఎప్పుడూ ప్రచారం లో  వినూత్న పోకడలు పోయే టీఆరెస్ కార్యకర్తలు , ఈసారి కారు గుర్తు  ముగ్గు ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు . మున్సిపోల్స్ లో అధికార పార్టీ సింహభాగం స్థానాలు దక్కించుకునేందుకు చేస్తోన్న కృషిలో మహిళా కార్యకర్తలు తాము సైతం అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: