తెలంగాణ‌లో జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల దాఖ‌లు ఘ‌ట్టం ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ప్రచారంపై, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌పై ప‌డింది. ఈ క్ర‌మంలో పార్టీల ముఖ్య‌నేత‌లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, తాజాగా బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ భారీ సెటైర్ వేసింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీదే విజ‌య‌మ‌ని గులాబీ నేత‌లు వెల్ల‌డించారు. కాంగ్రెస్, బీజేపీల ప‌రిస్థితి అభ్య‌ర్థుల‌ను వెతుక్కునేందుకే స‌రిపోతోంద‌ని వ్యాఖ్యానించారు.

 


తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నేత‌లు గట్టు రాంచందర్ రావు,శివకుమార్ ,గెల్లు శ్రీనివాస్ యాదవ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ చివరింఘట్టం పూర్తి అయ్యిందని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం 35 మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ పార్టీ 84 వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకుంద‌ని పేర్కొన్నారు. దీంతో పాటుగా ఓ డివిజన్ సైతం టీఆర్ఎస్ ఖాతాలో ఏకగ్రీవంగా చేరింద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతున్న మున్సిపాల్టీల్లో  700 వార్డుల్లో బీజేపీకి 400 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు లేరని వారు పేర్కొన్నారు.

 


తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ లేదని, బీజేపీకి ఓట్లు లేవని టీఆర్ఎస్ నేత‌లు త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఎద్దేవా చేశాయి. అందుకే మున్సిపాల్టీ ఎన్నిక‌ల్లోకాంగ్రెస్, బీజేపీలు సహకరించుకునే పనిలో ఉన్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ముసుగు పొత్తులో ఉన్నాయని దుయ్య‌బ‌ట్టారు. కరీంనగర్, నిజామాబాద్‌లలో పరస్పరం సహకరించుకుంటున్నాయని టీఆర్ఎస్ నేత‌లు ఆరోపించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు శత్రువులైనప్ప‌టికీ... తెలంగాణలో మిత్రులుగా మారిపోయాయ‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుత మున్సిపాల్టీ ఎన్నిక‌ల్లో గ‌త ఏడాది జ‌రిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పునరావృతం  అవుతాయని కాంగ్రెస్ బీజేపీ నేత‌లు అంటుండ‌టం హాస్యాస్ప‌ద‌మ‌ని టీఆర్ఎస్ నేత‌లు అన్నారు. ``పార్ల‌మెంటు ఫ‌లితాలే వ‌స్తాయ‌నే వారు... స్థానిక సంస్థల ఫలితాలు పునరావృతం కావా ? అనేది ఆలోచించుకోవాలి. హుజూర్ నగర్‌లో గెలుపు కోసం పోరాటం చేయలేదా? ` అని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసి పోటీలో ఉన్నామని చెప్పేందుకు విపక్ష నేతలు చెప్పే యత్నం చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలు ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో వస్తాయని ధీమా వ్య‌క్తం చేశారు. 22న జరిగే ఎన్నికల్లో అన్నింటా విజయం త‌మదేన‌ని తెలిపారు. ఇప్ప‌టికే, పరకాల, చెన్నూరు టీఆర్ఎస్ ఖాతాలో చేరాయని వెల్ల‌డించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: