కొన్ని సంఘ‌ట‌నలు ఎంతో బాధ‌ను క‌లిగిస్తుంటాయి. ఓ వైపు క‌ఠిన ప‌రిస్థితులు...ఇంకో వైపు ఇబ్బందిక‌ర‌మైన నిజాలు...ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌నిషి దేనికి ఓటు వేస్తాడు? అంటే స‌రైన స‌మాధానం చెప్ప‌లేం. అదే స‌మ‌యంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజం వెలుగులోకి వ‌స్తే...ఇంకా చిత్రంగా ఉంటుంది క‌దా? ఇప్పుడు అదే జ‌రుగుతోంది. ఒక‌ట్రెండు రోజులుగా మీడియాలో ఓ వార్త హైలెట్ అవ‌డం మీరు గ‌మ‌నిస్తూనే ఉంటారు అదే. ఐదు వేల ఒంటెలను ఆస్ట్రేలియాలో కాల్చి చంప‌డం. ఈ ఘ‌ట‌న ఎంద‌రినో బాధ‌కు గురిచేసింది. అయితే, దీనికి మ‌న భార‌త‌దేశానికి చిత్ర‌మైన లింకు ఉంది.



దక్షిణ ఆస్ట్రేలియాలోని అనంగు ఆదివాసీ ప్రాంతంలో పచ్చదనం అధిక మొత్తంలో ఉంది. ఆ ప్రాంతంలో 2300 మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. అయితే, పెద్ద ఎత్తున ఒంటెల మందలు చెట్టూ చేమలను, నీటివనరులను పాడు చేస్తూ ఆదివాసీలకు ఇక్కట్లు కల్పిస్తున్నాయి. దీంతో ఒంటెల‌ను కాల్చివేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించుకుంది. ఈ ఆదేశాల‌తో హెలికాప్టర్లలో కూర్చున్న గన్‌మెన్లు ఒంటెల తలల మీదకు తుపాకులు ఎక్కుపెట్టి తూటాలను దింపుతూ పోయారు.



అయితే, అస‌లు చిత్ర‌మైన విష‌యం ఏంటంటే...ఈ ఒంటెలు ఆస్ట్రేలియాకు చెందినవి కావు. 1840లలో వాటిని ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఆస్ట్రేలియా భూభాగం విశాలమైందే. కానీ నీరు వంటి సహజవనరులు అరకొరగానే ఉంటాయి. సువిశాలమైన ఆస్ట్ర్రేలియా అన్వేషణకుగానూ ఒంటెలను రప్పించారు. తర్వాత ఆరు దశాబ్దాల్లో భారత్ నుంచి 20 వేల ఒంటెలను దిగుమతి చేసుకున్నారు. వీటి ఉపయోగం తగ్గడంతో క్రమంగా ఇవి అడవుల్లోకి వెళ్లాయి. చెట్టూచేమా తింటూ తామరతంపరగా పెరిగిపోయాయి. అలా ఆదివాసాల‌ను సైతం తీవ్రంగా ప్ర‌భావితం చేసేశాయి. అందుకే వాటిని కాల్చిచంపారు.



దీనిపై అధికారులు స్పందిస్తూ... జనావాసాల పరిరక్షణ కోసం ఈ పశుమేధం నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్తున్నారు. జంతు ప్రేమికుల ఆందోళనను అర్థం చేసుకుంటాం.. కానీ ఆ మారుమూల ప్రాంతంలోని స్థానిక తెగలవారు ఒంటెల కారణంగా అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను తప్పించాల్సి ఉంది` అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. బయటి నుంచి దిగుమతైన ఒంటెలు స్థానికుల పాలిట చీడలా తయారయ్యాయని ఆయన చెప్పారు. ఈ ఐదు రోజుల వేట మంగళవారంతో ముగిసింది. ఐదు వేల ఒంటెల‌ను ఆ వేట బ‌లి తీసుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: