తెలంగాణ‌లో జ‌రుగుతున్న మున్సిపాల్టీ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప‌ట్టు సాధించేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన‌ కాంగ్రెస్‌, బ‌ల‌ప‌డాల‌నే వ్యూహంతో పాటు బ‌ల‌మైన శ‌క్తిగా నిరూపించుకోవాల‌నే ల‌క్ష్యంతో బీజేపీ త‌మదైన శైలిలో సాగుతున్నాయి. ఇక మిగ‌తా పార్టీల‌న్నింటికంటే...గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల వ‌లే పై చేయి కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా, అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకున్న టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...పార్టీ నేత‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు. ఓ కోర్ టీం ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారు.




 రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పది కార్పొరేషన్లలో భారీ విజయంపై ప్రత్యేక దృష్టిసారించింది. 10 కార్పొరేషన్లలో కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండంతోపాటు, హైదరాబాద్‌ చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు. కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ స్వయంగా మాట్లాడుతున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్యతోపాటు.. ప్రచారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. కార్పొరేషన్లలోని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దఎత్తున నామినేషన్లు వేశారని.. వారిలో పార్టీ అభ్యర్థి మినహా మిగిలినవారిని పోటీనుంచి తప్పుకొనేలా చూడాలని కేటీఆర్‌ ఆదేశిస్తున్నారు.



పది కార్పొరేషన్లలో విజయం సాధించాలని.. ఇందుకోసం పూర్తిస్థాయిలో కృషిచేయాలని పార్టీ నేత‌ల‌కు కేటీఆర్‌ స్ప‌ష్టం చేస్తున్నారు. పార్టీ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. గతంలో వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ తదితర కార్పొరేషన్లకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులిచ్చి వాటి అభివృద్ధికి కృషిచేసిన తీరును వివరించాలని కేటీఆర్ సూచించారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ల అభివృద్ధికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందనే హామీ ఇవ్వాలని తెలిపారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని.. రెండుపార్టీల లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలకు వివరించాలని కేటీఆర్‌ సూచించారు. ఈ రెండు కార్పొరేషన్లపై ఆయన సమీక్షిస్తూ.. ఈ రెండు పార్టీలు టీఆర్‌ఎస్‌ను సొంతంగా ఎదుర్కోలేకపోతున్నాయని.. ఇదే మనకున్న బలాన్ని సూచిస్తున్నదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: