రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా డోన్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో గొంతు నులిమి చంపేశాడు. భార్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె గొంతు నులిమి చంపేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాడానికి ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నాగజ్యోతికి  ఏడు సంవత్సరాల క్రితం డోన్ మండలం చిన్నమల్కాపురంకు చెందిన సోమశేఖర్ తో  వివాహమైంది.
 
పెళ్లైన తరువాత పిల్లలు పుట్టకపోవడంతో తరచూ సోమశేఖర్ భార్యను వేధించేవాడు. వేధింపులకు తట్టుకోలేక మూడు సంవత్సరాల క్రితం పుట్టింటికి వచ్చిన నాగజ్యోతి పుట్టింట్లోనే తల్లిదండ్రులతో ఉంటోంది. కొన్ని రోజుల క్రితం గ్రామ పెద్దల మధ్య పంచాయతీ జరగగా గ్రామ పెద్దలు సోమశేఖర్ కు భార్యను తనతో పాటు తీసుకెళ్లాలని సూచించారు. అత్తారింటికి వచ్చిన నాగజ్యోతిని సోమవారం రోజు ఉదయం గొంతు నులిమి భర్త చంపేశాడు. 
 
ఆ తరువాత ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకొని నాగజ్యోతి చనిపోయిందని అందరినీ నమ్మించాడు. నాగజ్యోతి ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో నాగజ్యోతి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారించగా సోమశేఖర్ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నాగజ్యోతి హత్య కేసులో సోమశేఖర్ తో పాటు అతడి తండ్రి పాత్ర కూడా ఉందని అతడిని అరెస్ట్ చేయాలని నాగజ్యోతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 
 
నాగజ్యోతి తండ్రి రామ సుబ్బయ్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి నాగజ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పక్కా ప్రణాళికతోనే సోమశేఖర్ నాగజ్యోతిని హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామస్తులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: