హైదరాబాద్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మిస్సింగ్‌ మిస్టరీ వీడింది.. ఇరువై రోజులుగా గాలిస్తున్న పోలీసులకు చివరకు పుణేలో కనిపించింది. అక్కడి నుండి ఆమె తమ్ముడితో ఫోన్‌లో మాట్లాడించారు పోలీసులు. అయితే  ఇంటికి రావడానికి రోహిత ఇష్టపడటం లేదు. దీంతో పుణేలోనే ఆమె స్టేట్ మెంట్‌ రికార్డ్ చేశారు దర్యాప్తు అధికారులు.

 

దిశ మిస్సింగ్‌, ఎన్‌కౌంటర్ హీట్‌ తగ్గక ముందే సైబరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది.. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని మంత్రి సెలెప్టియా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది రోహిత.  కొంత కాలంగా రోహిత, ఆపిల్‌ ఇండియాలో జాబ్‌ చేస్తోంది. డిసెంబర్‌ 26 తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటికి వెళ్లిన రోహిత తిరిగి రాలేదు. 

 

రోహిత ఫోన్‌కు సోదరుడు పరిక్షిత్‌ పలుమార్లు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆమె అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. కానీ ఆమె ఫ్లాట్‌ కు తాళం వేసి ఉండటంతో డోర్‌ బ్రేక్‌ చేసి లోపలికి వెళ్లారు. రోహితకు సంబంధించిన సెల్‌ఫోన్‌, ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు, ల్యాప్‌ టాప్‌లు రూమ్‌లోనే కనిపించాయి.తన సోదరి ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆందోళన పడిన ఆమె సోదరుడు,  డిసెంబర్‌ 29న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 

కేసు నమోదు చేసిన పోలీసులు రోహిత ఆచూకీ కోసం గాలించడం మొదలుపెట్టారు. డిసెంబర్‌ 26న మూడుంపావు ప్రాంతంలో విప్రో సర్కిల్‌ వద్ద రోహిత ఆటో ఎక్కుతున్న సీసీ ఫుటేజ్‌ లభించింది. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. మొత్తం నాలుగు టీమ్‌లను రోహిత ఆచూకీ కోసం ఏర్పాటు చేశారు. చివరకు రోహిత ఆచూకీని పుణేలో గుర్తించింది దర్యాప్తు బృందం. 

 

రోహితను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, తన సోదరుడు పరీక్షిత్‌తో మాట్లాడించారు పోలీసులు. అయితే తనకు ఇంటికి రావడం ఇష్టం లేదని,  తాను ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోదరుడికి రోహిత తెలిపింది. తన లైఫ్‌ తాను బతుకుతానని సోదరుడికి చెప్పడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. 

 

రోహిత తాను ఏవిధంగా హైదరాబాద్‌ నుండి పుణె వరకు వెళ్లానో పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.. గచ్చిబౌలి నుండి ట్రిపుల్‌ ఐటీ వరకు ఆటోలో, అక్కడి నుండి ఆరంఘర్‌ చౌరస్తా వరకు బస్సులో వెళ్లానని తెలిపింది. అక్కడి నుండి బెంగుళూరుకు వచ్చానని, తరువాత హుబ్లీ, అక్కడి నుండి పుణేకు వచ్చినట్లు తెలిపింది. 

 

హైదరాబాద్‌కు రావడం  రోహితకు ఇష్టం లేకపోవడంతో అక్కడే ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు దర్యాప్తు అధికారులు. మరోవైపు సోదరితో ఫోన్‌లో మాట్లాడిన పరీక్షిత్‌, పుణేకు బయల్దేరాడు. అయితే, రోహిత కనిపించకుండా పోవడానికి కుటుంబ సమస్యలే కారణంగా దర్యాప్తులో గుర్తించారు పోలీసులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: