తెలంగాణ రాష్ట్ర రైతులకు సంక్రాంతి పండుగ రోజున కేంద్రం శుభవార్త చెప్పింది. మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. అతి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో పసుపు పంట బాగా పండుతూ ఉండటంతో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుండి డిమాండ్ ఉంది. 
 
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ పార్టీ వస్తుందని తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ మీద రాసి ప్రజలకు మాట ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు ధర్మపురి అరవింద్ ను నిజామాబాద్ ఎంపీగా గెలిపించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో 178 మంది రైతులు కూడా నామినేషన్లు వేయడంతో 90 వేల ఓట్లు రైతులకు వచ్చాయి. 
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడు నెలలు దాటింది. పసుపు బోర్డు ప్రతిపాదన దిశగా అడుగులు పడకపోవడంతో పసుపు బోర్డు ఏర్పాటు కాదనే అనుమానాలు వ్య్యక్తమయ్యాయి. రైతులు కూడా పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఆవశ్యకత గురించి కేంద్రానికి వివరించారు. 
 
ధర్మపురి అరవింద్ కృషితో కేంద్రం పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటు దిశగా సంకేతాలు పంపింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పసుపు బోర్డు దిశగా సంకేతాలు పంపడం వలన మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో 25వ తేదీన పీయూష్ గోయల్ పసుపు బోర్డు గురించి ప్రకటన చేయనున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: