కొన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లే చిత్రంగా ఉంటారంటే...కొన్ని రాష్ట్రాల్లో రాజ‌కీయాలే చిత్రంగా ఉంటాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌నే తేడా లేకుండా... నేత‌లేవ‌రైనా ఒక‌టే త‌ర‌హా కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ప‌క్క రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో అదే జ‌రిగింది. సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత‌, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్‌ యెడియూరప్ప సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  ఓ స్వామీజీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న ఇలా రియాక్ట‌య్యారు.

 

కర్ణాటకలోని దేవంగిరేలో జ‌రిగిన ఓ స‌మావేశానికి సీఎం యెడియూరప్పతో పాటు లింగాయత్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన బోధకుడు వచననంద స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వచననంద స్వామి మాట్లాడుతూ.. సభా వేదికపై సీఎం ఉన్నారు. ఈ సందర్భంగా తాను ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. లింగాయత్‌ కమ్యూనిటీకి చెందిన మురుగేష్‌ నీరానికి అన్యాయం చేయొద్దు. ఇప్పుడు ఆయనను జాగ్రత్తగా చూసుకోకపోతే, లింగాయత్‌ సమాజం అంతా మీకు మద్దతివ్వరు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని యెడియూరప్పకు వచననంద స్వామి సూచించారు. దీంతో సహనం కోల్పోయిన సీఎం యెడియూరప్ప సభావేదికపై లేచి.. స్వామిజీ వద్దకు వెళ్లారు. మీరు చెప్పేవన్నీ వినడానికి నేను ఇక్కడకు రాలేదు అని యెడియూరప్ప కోపంతో చెప్పేశారు.

 

ఈ  మీ డిమాండ్ల ప్రకారం తాను పని చేయలేను అని స్పష్టం చేశారు. తాను ఇక్కడ్నుంచి వెళ్లిపోతున్నాను అని సీఎం కొంచెం దూరం వెళ్లారు. స్వామిజీ కోరడంతో మళ్లీ యెడియూరప్ప వెనక్కి తిరిగి వచ్చి సీట్లో కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా యెడియూరప్ప మాట్లాడుతూ... తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు 17 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సహకరించారని, వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తనది అని ఆయన స్పష్టం చేశారు. ``స్వామిజీకి విజ్ఞప్తి చేస్తున్నాను.. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ 17 మంది తమ మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వారు ఒక వేళ ఆ త్యాగం చేయకపోతే యెడియూరప్ప సీఎం కాలేకపోయేవారు. మీ ఆశీస్సులు కూడా తనకు ఉండడం వల్లే సీఎం అయ్యాను. తాను ప్రత్యేకంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సలహాలు ఇవ్వండి అని యెడియూరప్ప స్వామిజీని కోరారు. మీకు ఒక వేళ తాను అవసరం లేకపోతే.. రేపే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ కుర్చీ తనకు అంకితం కాదని యెడియూరప్ప స్పష్టం చేశారు. 

 

అయితే ఈ నెలఖారులో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. 225 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 34 మందికి మించి మంత్రులు ఉండరాదు. ఇప్పటికే 17 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మురుగేష్‌ నీరానికి మంత్రి పదవి ఇవ్వాలని స్వామిజీ పట్టుబట్టారు. అయితే మంత్రివర్గ విస్తరణపై అమిత్‌ షాతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు యెడియూరప్ప. ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు కావొస్తున్న త‌రుణంలో యెడియూరప్ప చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: