తెలంగాణలో జ‌రుగుతున్న‌ మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు ఎన్నిక‌ల ప్ర‌చారంలో క్షేత్ర‌స్థాయిలో అభ్య‌ర్థులు బిజీ అవుతుండ‌గా మ‌రోవైపు ముఖ్య‌నేత‌లు ఎత్తులు-పై ఎత్తుల‌తో స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తాజాగా ఓ మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. చిత్రంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనే రెండో సారి ఒకే అంశం ఆధారంగా....త‌క్కువ స‌మ‌యంలో ఆయ‌న ఇర‌కాటంలో ప‌డిపోవ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. అలా త‌న‌కు తానుగా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోవ‌డ‌మే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీని సైతం ఆరోప‌ణ‌ల‌కు కేంద్రంగా  మార్చింది రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డి.

 


గ‌త వారం టికెట్ల కేటాయింపు విష‌యంలో మంత్రి మ‌ల్లారెడ్డి స‌మ‌స్య‌ల్లో ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో దయాకర్‌రెడ్డి అనే వ్యక్తికి టీఆర్ఎస్ టికెట్ కేటాయించలేకపోయింది.. మరోరకంగా న్యాయం చేస్తానని ఆయనకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే, దయాకర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి బీఫారం తీసుకుని నేరుగా దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో... దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్‌ను ఓడిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ ఎపిసోడ్‌లో మంత్రి మ‌ల్లారెడ్డికి పార్టీ పెద్ద‌లు క్లాస్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి దయాకర్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దయకర్‌రెడ్డి తిరిగి టీఆర్‌ఎస్‌లోనే కొనసాగించే విధంగా మల్లారెడ్డి ప్రయత్నం చేసి స‌ఫ‌లం అయ్యారు. 

 


ఇక తాజాగా టికెట్లు ఆశించి భంగపడిన నేత విష‌యంలో మ‌ల్లారెడ్డి బుక్క‌య్యార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోలు రాములు మధ్య టికెట్ల విష‌యంలో వివాదం జ‌ర‌గ‌డం, ఈ మేర‌కు ఫోన్ సంభాషణ వైర‌ల్ అవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తన మనిషి రమేష్‌కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని రాపోలు రాములు మల్లారెడ్డిని నిలదీశారు. టికెట్ కోసం తన వద్ద డబ్బు డిమాండ్ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్ఠానానికి చెప్తానని బెదిరించారు. దీనికి మ‌ల్లారెడ్డి సైతం చెప్పుకోవాల‌ని అన్నారు. దీంతో..మంత్రి మ‌ల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: