గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చను నిజం చేస్తూ... సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌నతాపార్టీతో పొత్తు పెట్టుకుంది. పార్టీ ముఖ్య స‌మావేశం నుంచి హ‌ఠాత్తుగా ఢిల్లీ వెళ్లిన జ‌న‌సేనాని అక్క‌డ ఓ రోజు నిరీక్ష‌ణ‌, మ‌రోరోజు కీల‌క స‌మావేశాల అనంత‌రం ఏపీకి వ‌చ్చేశారు. అనంత‌రం విజ‌య‌వాడ‌లో ఏపీ బీజేపీ ముఖ్య నేత‌లు, జ‌న‌సేన నేత‌ల‌తో స‌మావేశం జ‌రిపి రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరిన‌ట్లు ప్ర‌క‌టించారు. వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డిన ఇరు పార్టీల నేత‌లు 2024లో అధికారం ద‌క్కించుకోవ‌డమే ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

 

అయితే, జ‌న‌సేన‌- బీజేపీ పొత్తు, ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌లు త‌దిత‌ర అంశాల‌పై అధికార వైసీపీ మండిప‌డింది. వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో పొత్తులు సాధారణమ‌ని కాబ‌ట్టి ఈ రెండు పార్టీల పొత్తుపై స్పందించాలని తాము అనుకోవ‌డం లేదని అయితే, వారు చేసిన ఆరోపణలు మీద స్పందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. అయితే, ఈ రెండు పార్టీల పొత్తుపై అంబ‌టి సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తిని పెట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదారి ఈదుతానంటే మాకేం నష్టం లేదు అని బీజేపీకి చుర‌క‌లు అంటించారు. 

 

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ తీరుపై అంబ‌టి మండిప‌డ్డారు. ``మీరు బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేశారు...ఆ తర్వాత టీడీపీతో దూరంగా ఉన్నట్లు నటించారు. వామపక్షాలతో కలిశారు. మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. రాజకీయ స్థిరత్వం లేని మీరు ఒక పార్టీతో దీర్ఘ కాలం ఉన్నారా? ఈ 7 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం...అదే మా వైఫల్యమా? ప్రభుత్వ విఫలం కానీ, సఫలం కానీ అనేది 7 నెలల్లో నిర్ణయిస్తారా? ..అలా విమర్శించడం విజ్ఞత కాదు` అని పేర్కొన్నారు.

 

 చంద్రబాబు సీఎం అయినా, ప్రతిపక్షంలో ఉన్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జగనే టార్గెట్ అని అంబ‌టి వ్యాఖ్యానించారు. చంద్రబాబు- సుజనా, సీఎం రమేష్ లాంటి వాళ్ళని బీజేపీలోకి పంపారు..ఇప్పుడు మీరు. ``ప్ర‌త్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అని మోడీపై ధ్వజమెత్తిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇవాళ జీడిపప్పు, కిస్మిస్‌తో తాజా లడ్డూలు పంపారా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే ప‌వ‌న్‌ హోదా అడక్కుండా బేషరతుగా ఎందుకు కలసి పని చేస్తానని హామీ ఇచ్చారు? అదేమంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అడగమంటున్నాడు...మోడీతో కలిసిన నువ్వు ఏమి చేస్తావ్?`` అని నిల‌దీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: