జనసేన , బీజేపీ ల మధ్య మైత్రి వల్ల అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టమో తెలియదు కానీ టీడీపీ కి  మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పేటట్లు కన్పించడం లేదు . ఎందుకంటే రానున్న రోజుల్లో బీజేపీ, జనసేన పార్టీలతో ఆ పార్టీ నాయకత్వం  మైత్రిని కోరుకుంటోందన్నది నిర్వివాదాంశమే .  ఇటీవల జనసేనానిని ,  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తారు . అయినా పవన్ మాత్రం, టీడీపీ తో కాకుండా బీజేపీతోనే మైత్రి రాజకీయానికి మొగ్గు చూపారు .

 

కేంద్రం లో బీజేపీ అధికారం లో ఉండడం వల్ల కాబోలు జనసేనాని ఆ పార్టీ తో అంటకాగేందుకు ఆసక్తి ప్రదర్శించి ఉంటారన్న వాదనలు విన్పిస్తున్నాయి . బీజేపీ తో పవన్  మైత్రి రాజకీయం వెనుక చంద్రబాబు ఉన్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు . అయితే  ఏపీ లో  జనసేన మాత్రమే భవిష్యత్తు లో పొత్తు ఉంటుందని , ఇక ఏ పార్టీతోనూ తమకు  పొత్తు ఉండదని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు . వైస్సార్ కాంగ్రెస్ , టీడీపీ లతో తమకు ఎటువంటి రహస్య ఒప్పందం లేదని బీజేపీ  నేతలు వెల్లడించారు .

 

ఇక దానికితోడు  విజయవాడ లో  బీజేపీ , జనసేన మైత్రి బంధానికి బీజం పడిన  సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు , మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి , ఎమ్మెల్సీ సోము వీర్రాజు  హాజరుకావడం ఇటీవల టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన సుజనా , సీఎం రమేష్ లను పక్కన పెట్టడం  పరిశీలిస్తే , భవిష్యత్తులో  టీడీపీ తో తమకు  ఎటువంటి పొత్తు ఉండదనే సంకేతాలను ఆ పార్టీ నాయకత్వం  క్యాడర్ కు పంపినట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . ఈ సమావేశం లో పాల్గొన్న వారంతా  టీడీపీ తో మైత్రిని  తీవ్రంగా వ్యతిరేకించే వారే కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: