గ‌త కొద్దికాలంగా ఉల్లిధ‌ర‌లు ఊహించ‌ని రీతిలో పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.100 తాకాయి. దీంతో విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కిలో రూ.60 నుంచి 70 పలుకుతున్న సంగతీ విదితమే. అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు పరుగులు పెట్టాయి. చివరకు విదేశాల నుంచి ఉల్లి దిగుమతుల్ని కేంద్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ఉల్లిగడ్డలను తీసుకొనేందుకు చాలా రాష్ర్టాలు ఆసక్తి చూపకపోవడంతో వాటిని ఎలా వదిలించుకోవాలా అని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

రవాణా ఖర్చులను తామే భరించి కిలో రూ.55 చొప్పున దిగుమతి ధరకే విదేశీ ఉల్లిగడ్డలను అందజేస్తున్నప్పటికీ వాటిని తీసుకొనేందుకు చాలా రాష్ర్టాలు ముందుకు రావడంలేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌  వెల్లడించారు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గత రెండు నెలల నుంచి కిలో ఉల్లి రిటైల్‌ ధర రూ.100కుపైగా పలుకుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతులు రావడం, కొత్త ఖరీఫ్‌ పంట కూడా ఇప్పుడిప్పుడే చేతికొస్తుండంతో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. ఇప్పటివరకు విదేశాల నుంచి 36 వేల టన్నుల ఉల్లి దిగుమతులకు కాంట్రాక్టు ఇవ్వగా 18,500 టన్నులు భారత్‌కు చేరుకున్నాయని, వీటిలో రాష్ర్టాలు కేవలం 2 వేల టన్నులు మాత్రమే తీసుకోవడంతో మిగిలిన దిగుమతులను ఎలా వదిలించుకోవాలా అని మదనపడుతున్నామని పాశ్వాన్‌ విలేకర్లకు తెలిపారు.

 

దిగుమతులు వచ్చినా ఇప్పటికీ ఉల్లి ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయని విలేకర్లు ప్రశ్నించగా.. ‘దేశంలో సరఫరాలను మెరుగుపర్చి ధరలను నియంత్రించేందుకే టర్కీ, ఈజిప్టు, అఫ్గానిస్థాన్‌ నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకుంటున్నాం. వాటిని తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోతే మేము ఏమి చేయగలం’ అని పాశ్వాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డలను తీసుకున్నాయని, మిగిలిన రాష్ర్టాలు వాటిని తీసుకునేందుకు విముఖత చూపుతున్నాయని ఆయన వాపోయారు. దేశీయంగా పండించే ఉల్లితో పోలిస్తే విదేశీ ఉల్లిగడ్డల రుచి భిన్నంగా ఉంటున్నదని, రిటైల్‌ మార్కెట్లలలో దేశీయ ఉల్లిగడ్డలు కూడా అదే ధరకు లభిస్తుండటంతో వినియోగదారులు విదేశీ ఉల్లిగడ్డలను కొనుగోలు చేయడంలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. కాగా, ప్ర‌స్తుత ప‌రిస్థితిపై కేంద్ర‌మంత్రి చ‌మ‌త్కారంగా స్పందిస్తూ...రేపు ఎవరైనా కోర్టుకెళ్లి.. దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయని ఫిర్యాదు చేస్తారేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: