జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కొరకు బీజేపీ పార్టీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చానని చెప్పారు. బీజేపీ పార్టీ పెద్దలతో ఈ విషయం గురించి గత కొన్ని నెలలుగా చర్చలు జరుపుతూ వచ్చానని తెలిపారు. బీజేపీ జనసేన పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. గతంలో బీజేపీ పార్టీతో ఏర్పడిన అంతరాలను తొలగించుకుంటామని పవన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. 
 
ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఈ కలయికకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా అవసరం ఉన్న ప్రతిచోటా సంపూర్ణంగా, మనస్పూర్తిగా కలిసి పని చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. బీజేపీ జనసేన పార్టీల సమన్వయం కొరకు కమిటీని ఏర్పాటు చేసుకుంటామని పవన్ అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని గతంలో రాజకీయంగా అభిప్రాయాలు తీసుకున్న తరువాత మాత్రమే నిర్ణయించారని పవన్ అన్నారు. కుటుంబ పాలన, కులతత్వంతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తామని అన్నారు. అమరావతిని తరలిస్తే చూస్తూ ఊరుకోమని తెగించే నాయకత్వం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అని అనడం ప్రజలను మభ్యపెట్టడమే అని పవన్ అన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టును తరలించే అధికారం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో బాధ్యత వహించాలని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో అప్పట్లో వాళ్లు అంగీకరించకుండా ఉంటే బాగుండేదని అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్టీనే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఏఏ గురించి స్పందిస్తూ ఇక్కడి ముస్లింలకు పౌరసత్వం రద్దు చేస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని అది పూర్తిగా అవాస్తవం అని అన్నారు. మన దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: