తెలంగాణ‌లో హోరాహోరీగా జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌లు ఆస‌క్త‌కిర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఈ ఎన్నిక‌ల గెలుపును త‌న భుజంపై వేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌ నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి పోటీ లేదని అయినా ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

 

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద్వారా గత ఆరేళ్లుగా ప్రజలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి వారి అనుభవంలో ఉన్నాయని.. వాటిని మరోసారి వివరిస్తే వారు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. పింఛన్లు మొదలుకొని, కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, జిల్లాల వికేంద్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాలను అభ్యర్థులకు గుర్తుచేశారు. పట్టణాల్లోని ప్రధాన సమస్య అయిన తాగు నీటి కొరతను తగ్గించామని, మిషన్‌ భగీరథలో భాగంగా బల్క్‌వాటర్‌ సైప్లె ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం ఖాయమని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అభ్యర్థులు గెలుపు మనదే అన్న ధీమాతో ప్రచారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. పార్టీ బీ ఫారం కోసం ప్రయత్నంచేసిన తోటి నాయకులను కలుపుకొని ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వార్డుల్లో ఉన్న పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు వెంటనే ఏర్పాటుచేయాలని, పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి ఐదుసార్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని చెప్పారు. ప్రతి వార్డు.. పట్టణాల అవసరాల మేరకు స్థానిక మ్యానిఫెస్టోలను విడుదల చేయాలని సూచించారు. 

 


కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులు లేక, అన్నిచోట్ల పోటీపడలేక పోయాయని కేటీఆర్ చెప్పారు. ఆయా పార్టీల క్యాడర్‌లోనూ ఉత్సాహం కనిపించడం లేదన్నారు. ఈ రెండు పార్టీలకు పట్టణాల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, కాంగ్రెస్‌ హయాంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చుచేసిన నిధులను పోల్చుకొంటే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది రెట్లు పట్టణాలకోసం కేటాయించిందని చెప్పారు. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధికి, టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజువేసుకొని ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరాలని కేటీఆర్‌ అభ్యర్థులకు సూచించారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. బీజేపీ ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ప్రత్యేక నిధులను పట్టణాలకు తేలేకపోయిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: