ఏపీలో అమరావతి కోసం ఆందోళనలు జరుగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నామ‌ని.. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలివడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని ప‌వ‌న్ తెలిపారు. దీంతో స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు బలమైన, సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలనను అందించడమే మా లక్ష్యం అంటూ ప‌వ‌న్ క‌ళ్యాన్ వెల్ల‌డించారు. అలాగే  2024లో జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంద‌ని కూడా తెలిపారు.

 

అయితే బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరేలా చక్రం తిప్పింది మాత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్. ఈ విషయాన్ని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా వెల్లడించారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తప్పకుండా ఆంధ్రా సీఎం అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  కర్ణాటకలోని ఉడిపికి చెందిన సంతోష్ దీర్ఘకాలంగా సంఘ్ లో పని చేశారు. అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వెళ్లిన యడ్డీ కారణంగా కర్ణాటక బీజేపీని నడిపించింది ఆయనే. భార్యపిల్లలు లేని అతనికి మీడియా ముందుకు రావటం.. ఫోటోలు దిగటం లాంటివి అస్సలు ఇష్టముండదట. బీజేపీ బలహీనతలేంటో తెలుసుకున్న సంతోష్.. గత దశాబ్ద కాలంలో కర్ణాటకలో పార్టీ ఎదగడానికి శ్రమించారు. ప్రతి జిల్లాలోనూ ఆయనకు నెట్‌వర్క్ ఉంద‌ట‌.

 

ఇక గడిచిన పదేళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు గోవా, తమిళనాడు, కేరళలో పార్టీని బలోపేతం చేయ‌డంలో కీలకభూమిక పోషిస్తుంటారు. పుస్తకాలను అమితంగా చదివే సంతోష్‌కు పర్యావరణం, చైనాతో సంబంధాలు, రక్షణ, సైద్ధాంతిక భిన్నత్వం లాంటి అంశాలపై ఆస‌క్తి ఎక్కువ‌గా చూపుతార‌ట‌. పవన్ ఢిల్లీకి వెళ్లడానికి కొద్ది రోజుల ముందు ఆయన శిష్యులైన ప్రతాప్ సింహా, తేజస్వి సూర్య వచ్చి జనసేనానిని కలిసి వెళ్లారు. పవన్ ఢిల్లీలో నడ్డాను కలిసిన సమయంలో సంతోష్ కూడా ఉన్నారు. ఇక బీజేపీ.. జనసేన మధ్య పొత్తు వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని సంతోష్ కు అత్యంత సన్నిహితుడు ఆయన శిష్యుడైన ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో పేర్కొనటం గమనార్హం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: