రాజధాని రైతులు చంద్రబాబునాయుడుకు బిగ్ షాకిచ్చారట. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల్లో  సుమారు 15 వేలమంది తామిచ్చిన  భూములను వెనక్కు తీసేసుకోవటానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.  ఐదు రోజుల క్రితం రాజధాని గ్రామాల్లోని కొందరు రైతులు ప్రభుత్వంతో చర్చలు జరిపే నిమ్మితం మంత్రులు  కొడాలి నాని, బొత్స సత్యానారాయణతో సమావేశం అయిన విషయం తెలిసిందే.

 

మంత్రులతో సమావేశం అయిన తర్వాత  రాజధాని అమరావతి నుండి తరలి వెళ్ళిపోవటం ఖాయమని రైతులకు అర్ధమైపోయింది. అందుకనే తామిచ్చిన భూములను తిరిగి వ్యవసాయయోగ్యంగా మార్చి తమకు ఇచ్చేస్తే తిరిగి తీసుకోవటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టంగా  చెప్పారట. అలాగే వ్యవసాయం చేసుకోవటానికి అవసరమైన సాయాన్ని కూడా ప్రభుత్వం అందించాలని కొందరు రైతులు డిమాండ్ చేశారట. రైతుల డిమాండ్ ను మంత్రులిద్దరూ జగన్మోహన్ రెడ్డి ముందుంచారని సమాచారం.

 

ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అమరావతి వివాదంపై అధ్యయనం చేయటానికి ప్రభుత్వం హైపవర్ కమిటిని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటి రైతులకు ఆమధ్య ఓ పిలుపిచ్చింది. అమరావతి ప్రాంతం అభివృద్ది, అభ్యంతరాలు, రైతుల సమస్యలు తదితరాలపై సిఆర్డీఏకి రాత మూలకంగా చెప్పాలని కోరింది. దానికి 17, 710 వినతులు వచ్చినట్లు జగన్ మీడియా చెప్పింది.  ఈ మెయిల్స్ ద్వారా 850 వినతులు, ఆన్ లైన్ ద్వారా 7750 వినతలు,  అమరావతితో సంబంధాలుండి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు 9 వేల వినతులు అందించినట్లు సమాచారం.

 

అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా గడచిన 31 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు చంద్రబాబునాయుడు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది రాజధాని ప్రాంతంలోనే ఉన్న కొందరు రైతులు ప్రభుత్వంతో చర్చలు జరపటం గమనార్హం. అదే సమయంలో తమ భూములను వెనక్కు తీసుకుని వ్యవసాయం చేసుకోవటానికి రైతులు సుముఖత వ్యక్తం చేశారనే ప్రచారంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. ఒకసారంటూ రైతులు ప్రభుత్వంతో చర్చలు మొదలుపెడితే ఇక చంద్రబాబు ఆందోళనల్లో ఎవరూ ఉండరని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: