నిర్భయ దోషులను ఈనెల 22 ఉరి తీయడం ఖాయమనే అంతా ఇప్పటి వరకూ అనుకున్నారు. ఈ మేరకు వార్తలు షికార్లు కొట్టాయి. అయితే వీరి ఉరి అంత సులభంగా అయ్యే పని కాదని తెలుస్తోంది. ఎందుకంటే మరోసారి వీరి ఉరి వాయిదా పడింది. చట్టంలో ఉన్న లొసుగులు వీరికి కలసి వస్తున్నాయి. ఇప్పుడు ఉరి ఎందుకు వాయిదా పడిందంటే..?

 

దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై రాష్ట్రపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్షమాభిక్షను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. అంతే కాదు.. ముఖేశ్‌ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా కేంద్రానికి సిఫారసు చేశారు.ఇక రాష్ట్రపతి నిర్ణయం లాంఛన ప్రాయమే. కానీ ఈ మేరకు నిర్ణయం వెలువడలేదు.

 

చట్టంలో ఉన్న మరో లొసుగు ఏంటంటే.. ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలని నిబంధన ఉంది. అందువల్ల ఈ నెల 22ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు మీడియాకు క్లారిటీ ఇచ్చారు. అసలు ఓ ఆడపిల్ల పట్ల కిరాతకుల్లా వ్యవహరించిన రాక్షసుల పట్ల కూడా ఈ తొక్కలో నిబంధనలేంటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

తాతల నాటి నిబంధనలు ఇంకా పాటించాల్సిన అవసరం ఉందా.. ఒక వేళ ఉన్నా.. నిర్భయ వంటి రేర్ కేసుల్లో కూడా వాటికి మినహాయింపు ఉండదా.. ఇలాంటి కేసుల పట్ల ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించి సత్వర న్యాయం జరిగేలా చూడదా.. అన్న ఆందోళన సమాజంలో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రేరెస్ట్ రేర్ కేసుల్లోనూ జోక్యం చేసుకోకపోతే.. ఇక దిశ లాంటి ఎన్ కౌంటర్లే సబబు అని జనం అనుకోవడంలో వింతేముంది..?

మరింత సమాచారం తెలుసుకోండి: