మున్సిపోల్స్ లో అధికార టీఆరెస్ భీ ఫామ్ దక్కని అభ్యర్థులు,  పలుచోట్ల రెబల్ గా పోటీ చేస్తున్నారు . విచిత్రమేమిటంటే రెబల్స్ పై ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తో , పార్టీ తరుపున పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు . తక్షణమే రెబల్స్ ను  పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారు . రెబల్స్ వల్ల తమ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నా  పార్టీ నాయకత్వం , రెబల్స్ ను సస్పెండ్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది .

 

ఒకవేళ రెబల్స్ విజయం సాధిస్తే , తిరిగి తమ గూటికి చేరుతారని భావిస్తోన్న పార్టీ నాయకత్వం, వారిని సస్పెండ్ చేయకుండ వేచి చూసే ధోరణి ని అవలంభిస్తున్నట్లు సమాచారం .  పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి  రెబల్స్ గా  పోటీ చేస్తోన్న వారిని   పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే , ముందుగా పార్టీ నాయకత్వాన్ని తన చర్యలతో సవాల్ చేస్తోన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ను బహిష్కరించాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు . అయితే జూపల్లి ని ఇప్పటికిప్పుడు  పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంతమాత్రం  శ్రేయస్కరం కాదని టీఆరెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ కొల్లాపూర్ ఎన్నికల ఫలితం ప్రతికూలంగా  వస్తే మొదటికే మోసం వస్తుందని భావిస్తోన్న పార్టీ నాయకత్వం, ఆయనపై  చర్యలు తీసుకునే విషయం లో   వేచి చూసే ధోరణని అవలంభిస్తున్నట్లుగా  పార్టీ వర్గాలు చెబుతున్నాయి .

 

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి జూపల్లి , ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో నిలిపి వారి తరుపున ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే . ఒకవేళ పార్టీ రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేసి , జూపల్లి పై చర్యలు తీసుకోకపోతే విమర్శలు వెల్లువెత్తే అవకాశాలుండడంతో పార్టీ నాయకత్వం , మున్సిపోల్స్ ముగిసే వరకు వేచిచూసే ధోరణి లో ఉన్నట్లు సమాచారం .     

మరింత సమాచారం తెలుసుకోండి: