తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పక్షాల్లో పుర పోరు చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా అధికార పక్షమైన గులాబీ దళంలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు కన్పిస్తుంది. అసంతృప్తి, అసమ్మతి జ్వాలలు రచ్చకెక్కుతున్నాయి. కొంతమంది గులాబీ దండు ఏకంగా తిరుగుబాహుతా ఎగురవేశారు. ఫలితంగా రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు అమాత్యులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మరి కొంత మంది తమ పబ్బం గడుపుకుంటున్నారు.  ఈ నేపథ్యంలోనే తమకు  తమ తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే విషయంలో కొంతమంది తెరాస నాయకులు రోడ్డెక్కారు. ఈ పరిణామాల క్రమంలోనే మేడ్చల్ పురపాలిక పరిధిలో టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు గోల మరింత రసవత్తరంగా మారింది. నేతల మధ్య విభేదాలు బయటపడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోలు రాములకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కడంతో ఈ టేప్ సంచలనం రేపుతోంది. తన తరపు వారికి టికెట్లు ఇవ్వకపోవడంపై రాపోలు రాములు మంత్రిని ఫోన్‌లో నిలదీశారు. ‘‘నీపై నమ్మకం పోయింది. నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు..’’ అని రాపోలు నిలదీయగా, తొందర పడొద్దని మంత్రి మల్లారెడ్డి నచ్చజెప్పారు. అయినా, రాపోలు వినలేదు. మల్లారెడ్డి వ్యవహారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్తానని, త్వరలో ఆయన్ను కలుస్తానని ఫోన్‌లో రాపోలు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కూడా నీ గురించి చెప్తానని బెదిరించగా, చెప్పుకోమని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. టికెట్ కోసం తన వద్ద డబ్బు డిమాండ్ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్ఠానానికి చెప్తానని బెదిరించారు. తనపై పోలీసు నిఘా పెట్టినా ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమేనని వెల్లడించారు.

తన మనిషి రమేష్‌కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని రాపోలు రాములు మల్లారెడ్డిని నిలదీశారు. ఆయన ఒక్కసారి కూడా తన వద్దకు రాలేదని మల్లారెడ్డి జవాబిచ్చారు. ప్రజల మధ్య ఉండాలా, నీ చుట్టూ తిరగాలా అని రాములు ప్రశ్నించారు. మల్లారెడ్డికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, పోలీసులకు పట్టిస్తానని రాపోలు రాములు హెచ్చరించారు. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకుని పురపోరుకు కత్తులు దుస్తున్నారు. అందులో భాగంగానే రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఏకమైనా తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీలు మంత్రి మల్లారెడ్డి అవినీతి భాగోతాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఈ ఘటనను పేర్కొంటూ.. తెరాస వైఖరిని ఎండగడుతున్నారు.  ఇదిలా ఉండగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేనిపరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అని టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.  ప్రతి వార్డు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని, ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని తెలిపారు. ప్రస్తుత స్థాయి నుంచి నివేదికల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి పురపాలక ఎన్నికలలో విజయం తథ్యమన్నారు. పార్టీ బీ ఫారం కోసం ప్రయత్నం చేసిన తోటి నాయకులతో కలుపుకుని సమిష్టిగా ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి అయిదు సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుమారు రూ. 45 వేల కోట్ల రుపాయలతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, పట్టణాల కోసం ఇప్పటికే మిషన్‌ భగీరథలో భాగంగా బల్క్‌ వాటర్‌ను అందిస్తున్నామన్న విషయాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: