నిన్న మొన్నటి వరకూ జనసేన పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్త పుత్రుడు అంటూ విమర్శించేవారు వైసీపీ నాయకులు. కానీ ఆయన ఇప్పుడు టీడీపీ తో ఉన్న స్నేహం తెంచుకుని బీజేపీతో కలుస్తానని ప్రకటించేశారు. వైసీపీ, టీడీపీ లకు సమదూరంలో ఉంటానని చెబుతున్నారు. అయినా సరే వైసీపీ నాయకులు మాత్రం పవన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

 

ఇప్పుడు చంద్రబాబుకు సాయం చేయడం కోసమే పవన్ కల్యాణ్ బీజేపీ వైపు వెళ్లాడని ఓ వైసీపీ మంత్రి అంటున్నారు. మరి బీజేపీలో చేరి చంద్రబాబుకు పవన్ ఎలా సాయం చేస్తాడని మీకు అనుమానం రావచ్చు.. కానీ అందులో లాజిక్ ఏంటో వైసీపీ మంత్రి పేర్ని నాని వివరించారు. మరి అదేంటో ఆయన మాటల్లోనే విందామా..?

 

మంత్రి పేర్ని నాని చెప్పిన పిట్ట కథ ఇది.. “ పవన్‌ కల్యాణ్‌ చెప్పేది ఒక్కటి..చేసేది మరొకటి. ఈ భూమి మీద నిఖార్సైన అవకాశ వాద రాజకీయ నేత ఎవరైన ఉన్నారంటే అది పవన్‌ మాత్రమే. వెనుకటి ఒక సామెత ఉంది. ఒక తండ్రి చనిపోతూ మంచంలో పడి ..ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు..నూటికి 90 మందితో చెడ్డవాడిగానే పిలిపించుకున్నాను. నా చివరి కోరిక నన్ను మంచి అనిపించమని కొడుకును కోరాడంట. కొడుకుకు ఒక్కటే ఆలోచన వచ్చింది.”

 

" తండ్రి చేసిన చెండాలమైన పనుల కంటే మరి ఎక్కువైన చండాలమైన పనులు చేస్తే కానీ మా నాన్నకు మంచి పేరు రాదనుకొని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు. ప్రజలంతా అప్పటి నుంచి తండ్రే నయం..కొడుకు దుర్మార్గుడు అన్నారట. అప్పుడు తండ్రి ఆత్మ శాంతించిందట. చివరి రోజుల్లో నా కొడుకు నా కోరిక తీర్చాడని తృప్తి పొందాడట. “

 

" ఆ రకంగా పవన్‌ చంద్రబాబు వద్ద మాట తీసుకున్నారు. ఇప్పటి దాకా అవకాశ వాద రాజకీయానికి మారుపేరుగా చంద్రబాబు ఉండేవాడు. నిసిగ్గుగా ..ఒక సైద్ధాంతిక ఆలోచన లేకుండా అవసరాలే ప్రాతిపాదికగా ప్రయాణించాలని చంద్రబాబు ఆలోచన చేశారు. చంద్రబాబుకు 70 పైచిలుకు వయసు ఉంది. తండ్రి కోరిక ఎలాగు కొడుకు లోకేష్‌ తీర్చలేరని పవన్‌ను కోరినట్లుగా ఉంది. నా కోరిక తీర్చు..నన్ను మంచొడు అనిపించు అని ఉంటాడు.అందుకనే ఆయన చంద్రబాబు కూడా ముక్కున వేలేసుకునేలా అవకాశ వాద రాజకీయాలు పవన్‌ ఈ రోజు చేయడం ప్రారంభించారు.. అంటూ వివరించారు మంత్రి పేర్ని నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: