మహిళలు ఏం చేయగలరు అని అందరు అనుకుంటూ ఉంటారు.  కానీ, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని మరోసారి నిరూపించారు.  వారికి ప్రోత్సాహం లభిస్తే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి చూపిస్తారు.  అందుకు ఓ ఉదాహరణ ఈ మహిళా అని చెప్పాలి.  ఎక్కడో పాకిస్తాన్ లోని సింధ్ లో పుట్టింది.  అక్కడే ఇంటర్ వరకు చదువుకున్నది.  పై చదువులు చదువుకోవాలి అనుకుంటే పాకిస్తాన్ లోని పరిస్థితులు అనుకూలించలేదు.  దీంతో సదరు మహిళ పాక్ నుంచి తన తల్లి, సోదరితో కలిసి ఇండియా వచ్చింది.  


అలా ఇండియాలోని రాజస్థాన్ కు వచ్చిన నీతా కన్వార్ అజ్మీర్ లోని సోఫియా కాలేజీలో బిఎ చదువుకున్నది.  అనంతరం రాజ్ పుత్ కు చెందిన భారతీయుడిని వివాహం చేసుకుంది.  వివాహం చేసుకున్న తరువాత గత 8 సంవత్సరాలుగా ఆ మహిళ భారతీయ పౌరసత్వం కోసం పోరాటం చేసింది.  ఎట్టకేలకు గతేడాది సెప్టెంబర్ నెలలో ఆమెకు పౌరసత్వం లభించింది.  పౌరసత్వం తీసుకున్న 4 నెలలకు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.  


టోంక్ జిల్లాలోని నట్వరా గ్రామంలో శుక్రవారం రోజున సర్పంచ్ ఎన్నికలు జరిగాయి.  ఈ సర్పంచ్ ఎన్నికల్లో నీతా పోటీ చేసింది.  పోటీ చేయడమే కాదు సమీప ప్రత్యర్థిపై ఆమె 400 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.  ఎన్నికల్లో గెలిస్తే మహిళా సాధికారికతకు పాటుపడతానని చెప్పింది.  ప్రజలు ఆమెను నమ్మి ఓటు వేసి గెలిపించారు.  ఇప్పుడు నీతా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.  మొన్నటి వరకు పాక్ కోడలు పిల్లా అని పిలిచేవారు.  ఇప్పుడు సర్పంచ్ పిల్లా అని పిలవడం మొదలు పెట్టారు.  


నీతా మామ ఠాకూర్ లక్షణ్ కరూర్ మూడు సార్లు ఆ గ్రామానికి సర్పంచ్ గా పనిచేశారు.  అయన స్ఫూర్తితోనే కోడలు నీతా కూడా ఎన్నికల్లో పోటీ చేసింది.  నీతా ఎన్నికల్లో విజయం సాధించిందని తెలుసుకున్న ఆమె తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.  నీతా తండ్రి, సోదరుడు ప్రస్తుతం పాక్ లోని సింధ్ లో ఉంటున్నారు.  అక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్న దానికి ఇదొక ఉదాహరణ.  

మరింత సమాచారం తెలుసుకోండి: