అధిష్టానం ఆదేశించినా ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అధినేత  హెచ్చరించినా అస్సలు ఖాతరు చేయలేదు. పట్టు వీడని విక్రమార్కుడిలా మరింత రెచ్చిపోయారు. తన అనుచర గణాన్ని అంతా రెబల్స్‌గా  ఎన్నికల బరిలోకి దించారు. తన సత్తా చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. నిజానికి...అక్కడ ప్రధాన పోటీ టీఆర్ఎస్,  రెబల్ అభ్యర్థుల మధ్యే నెలకొంది. ఫలితంగా కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. 

 

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మున్సిపల్‌కు ఇది తొలి ఎన్నిక. ఇక్కడ మొత్తం 19 వేల 2 వందల 5 మంది ఓటర్లున్నారు.  పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. బీసీ మహిళకు చైర్‌పర్సన్‌ సీటు రిజర్వ్ అయ్యింది. ఇక్కడి నుంచి మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు 2018లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన బీరం హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బీరం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆధిప్యత పోరు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరికి వారే తమ అభ్యర్థులను నిలబెట్టుకుని ఒకర్నొకరు ఓడించుకున్నారు. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో విభేదాలు మరోసారి పతాకస్థాయికి చేరాయి. తన వర్గీయులకు సరైన అవకాశాలు దక్కడం  లేదని భావించిన జూపల్లి  ఏకంగా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లోనూ పోటీకి నిలిపారు.  

 

స్వతంత్ర అభ్యర్దులుగా మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిస్తే గుర్తు సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇది ముందే పసిగట్టి, పక్కా  ప్రణాళికతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో నిలిపారు. తన వర్గీయులందరికి సింహం గుర్తు వచ్చేలా జాగ్రత్త పడ్డారు జూపల్లి. ఇదేదో ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇవ్వని తరుణంలో వేసిన స్టెప్ అసలే కాదు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత, మున్సిపల్ ఎన్నికల నగారా మోగే  క్రమంలోనే పక్కా  ప్లాన్‌తోనే  జూపల్లి వ్యూహత్మక అడుగులు వేశారు. ఇక రెబల్స్‌ను కట్టడి చేసేందుకు అధిష్టానం జూపల్లిని పిలిచి మాట్లాడింది. అయినా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఏకంగా అధిష్ఠానం ముందే కుండబద్దలు కొట్టారు. తన వర్గీయుల గెలుపునకు జూపల్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీంతో కొల్లాపూర్‌లో పోటీ కారు వర్సెస్ సింహంగా మారింది. 

 

మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని జూపల్లి పట్టుదలగా ఉన్నారు. పురపోరులో బీరం వర్గీయులు ఓడితే...పార్టీ పగ్గాలు తిరిగి తన చేతికి రావడం ఖాయమనే భావనలో జూపల్లి ఉన్నట్లు  సమాచారం. అందుకే అధిష్టానం హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా పంతంతో ముందుకువెళ్తున్నారు. ఇరవై వార్డుల్లో తన అనుయాయులను గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ తను బలపరిచిన అభ్యర్దులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కొల్లాపూర్ లో జూపల్లి వ్యవహార శైలి హాట్ టాపిక్‌గా మారింది.  

 

కొల్లాపూర్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పుర పోరును రక్తి కట్టిస్తున్నాయి. వార్డు అభ్యర్థుల గెలుపోటములు అనడం కంటే  బీరం , జూపల్లి బల నిరూపణగా రాజకీయం మారింది. మరి ఈ పురసమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో తేలాలంటే 25తేదీవరకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: