తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు తన సొంత జిల్లా మహబూబాబాద్‌లోని మున్సిపాల్టీల్లో గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. సొంత పార్టీల్లోని కొంద‌రు నేత‌లు ఆమెకు స‌హ‌క‌రించ‌డం లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో ఆమె క్షేత్ర‌స్థాయిలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.  ప్ర‌ధానంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన మహబూబాబాద్‌ మున్సిపాలిటీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. తాజాగా మ‌హ‌బూమాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్‌షోల ద్వారా మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్ర‌చారం నిర్వ‌హించారు.  

 

ప్రచారంలో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత 9, 10, 16, 19, 33 వార్డులో తిరిగి, దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు, దోశలు వేసి, ఐస్‌క్రీం పార్లర్‌లో ఐస్‌క్రీమ్‌ ఫార్లర్లు, తోపుడు బండి వ్యాపారులను పలకరించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిపించాలని కోరారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే చెప్పింది ఎన్నికలు పూర్తికాగనే మొదలు అవుతుందన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.కోట్లు అందిస్తారని వాటితో మానుకోట మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. 

 

కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ లేదని, జాడలేని బీజేపీకి ఓటు వేసి మీ ఓటును వృథా చేయొద్దని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ సూచించారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీల ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసుకోవాలంటే వార్డు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీనే గెలవాలని అది జరగాలంటే మన తండాలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలన్నారు. రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సాయం అందించి వారికి ఆర్థిక సాయమందించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నేడు కాలువల్లో నీరు వస్తుందన్నారు. గిరిజనులు కోసం గత ప్రభుత్వాలు చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్‌ నిండు మనస్సుతో గెలిపించాలని కోరారు. ఎంపీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలోనే వృద్ధులకు రూ. 2016 పెన్షన్‌, వికలాంగులకు రూ. 3,016 పెన్షన్‌ అందిస్తుందన్నారు. మేనమామ వలె కల్యాణలక్ష్మి కింద రూ. లక్షా16 కట్నం ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్‌ కిట్‌ అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ గిరిజన బిడ్డల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. ఇతర పార్టీలు గిరిజ‌నుల‌ను ఓట్‌ బ్యాంక్‌గా వాడుకుంటున్నారని ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: