మహారాష్ట్ర రాష్ట్రంలో షిరిడీ సాయి జన్మభూమి గురించి సరికొత్త వివాదం నడుస్తోంది. సాయిబాబా జన్మస్థలం ఎక్కడ..? సాయిబాబా షిరిడీలో పుట్టలేదా..? అనే ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి. సాయిబాబా జన్మస్థలం పర్భనీ జిల్లాకు చెందిన పత్రీ అని అక్కడి స్థానికులు భావిస్తూ 1999వ సంవత్సరంలో శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. పత్రీకి వేల సంఖ్యలో భక్తులు వస్తూ సాయి జన్మస్థాన్ మందిరాన్ని దర్శించుకుంటున్నారు. 
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వేల సంఖ్యలో పత్రీకి భక్తులు వస్తూ ఉండటంతో 100 కోట్ల రూపాయలు పత్రీకి మంజూరు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. సీఎం ఉద్ధవ్ చేసిన ఈ ప్రకటనతో వివాదం మొదలైంది. సాయిబాబా పత్రీలో పుట్టాడని ఆ తరువాత కాలంలో షిరిడీకి వచ్చాడని సాయి భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ప్రకటనకు నిరసనగా వివాదం మొదలుకాగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రేపటినుండి నిరవధికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటన చేసింది. 
 
తదుపరి కార్యాచరణ గురించి ఈరోజు సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశం కానున్నారు. పత్రీని అబ్భివృద్ధి చేస్తే షిరిడీ ప్రాముఖ్యత తగ్గిపోతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిరవధికంగా ఆలయాన్ని మూసివేస్తామని చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. షిరిడీ ట్రస్ట్ మాత్రం గ్రామస్తులతో మాట్లాడి తుది నిర్ణయం ప్రకటిస్తామని స్వామి సేవలు యధావిధిగా కొనసాగుతాయని భక్తులు ఆందోళన చెందవద్దని చెబుతోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా షిరిడీలో కొలువైన సాయిబాబాను కోట్ల సంఖ్యలో భక్తులు కొలుస్తుంటారు. షిరిడీ సాయిబాబా సంస్థాన్ రేపు షిరిడీ బంద్ కు పిలుపునివ్వడంతో పాటు షిరిడీ ఆలయంలో అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేసింది. ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంతో షిరిడీకి వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలు మాత్రం సాయినాథుని జన్మస్థలం పత్రీయే అని చెప్పటానికి ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: