అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అడ్డంగా ఇరికించేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్చే వేశారని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు . చంద్రబాబు దారిలోనే వెళ్లి ఆయన్ని నోరుమెదపకుండా చేయాలన్నదే జగన్ వ్యూహంగా కన్పిస్తోందని చెబుతున్నారు . 2014 సెప్టెంబర్ లో రాజధాని ప్రకటనపై చర్చ సందర్బంగా అసెంబ్లీ తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే  . రాజధాని   విజయవాడ చుట్టుపక్కల ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి , అనంతరం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని తన అభిప్రాయాన్ని మాత్రమే  చెప్పాలని కోరారు .

 

చంద్రబాబు  ప్రకటనపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన జగన్ , రాజధానిని  ప్రకటించిన తరువాత ఇక అభిప్రాయం చెప్పేదేముందని ప్రశ్నించారు . చర్చ జరిగిన తరువాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు . కానీ చంద్రబాబు ససేమిరా ఆనడం తో , చర్చలో పాల్గొనేందుకు జగన్ నిరాకరించారు . విజయవాడలో రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు, ఏర్పాటు చేయాలా ..వద్దా అన్న విషయాన్ని మాత్రమే  చెప్పాలంటూ డిమాండ్ చేశారు . అయితే ఈ విషయం లో అసంతృప్తిగానే అవునని చెప్పిన  జగన్ ... ఇప్పుడదే మంత్రాన్ని బాబుకు అప్పచెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .

 

మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని , ఏర్పాటుకు సానుకూలమో .. కాదో మాత్రమే  ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు .అమరావతిని  రాజధాని  కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం  ఇప్పటికే పెద్ద ఎత్తున రాజధాని రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు , ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది .ఒకవేళ  అసెంబ్లీలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తే ఆ పార్టీ ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంత ప్రజల దృష్టిలో విలన్ గా మారే అవకాశముంటుందని , ఇక మూడు రాజధానులు ఒకే చెబితే అమరావతి ప్రాంత రైతులు ఆ పార్టీని విశ్వసించే అవకాశం ఉండదని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: