ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీయార్ తన టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుని, ప్రతిపక్షం లేకుండా చేసుకున్నాడు. ఇక ఇప్పుడు జరుగబోయే మున్సిపల్ ఎలక్షన్స్‌లో కూడా తన సత్తా మరో సారి చాటాలని ఉబలాటపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు. ఇందులో భాగంగానే ఎన్నో ఎత్తులతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విజయం తమదే అనే ధీమాతో టీఆర్ఎస్ నాయకులు ఉండగా. ఈ ఎన్నికల్లో మాత్రం బయటపడకుండా కొన్ని లుకలుకలు లోలోపల జరుగుతున్నాయని తెలుస్తుంది.

 

 

ఒక వైపు రెబల్స్ బెడద, మరో వైపు టికెట్ పొందలేని నాయకుల అలకలు పార్టీని సతమతం చేస్తుండగా ఇప్పుడు మరో సమస్య టీఆర్ఎస్ ను వెంటాడుతుందంటున్నారు. అదేమంటే తన మిత్రపక్షంగా చెప్పుకునే మజ్లిస్‌ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పి ఎదురయ్యేలా వుందట. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే బీజేపీ నుంచి వస్తున్న విమర్శల్ని తట్టుకోలేక, గులాబీ నేతలు మిత్రపక్షం మజ్లిస్‌ స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇకపోతే బీజేపీ నేతలు మాత్రం మజ్లిస్‌ ముస్లిం పార్టీ అయితే తమకు అభ్యంతరం లేదనీ, కానీ అది పాకిస్తాన్‌కి వకాల్తా పుచ్చుకునేలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తుండడం గమనార్హం.

 

 

ఇక మొన్నటికి మొన్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అన్ని సీట్లూ కొల్లగొట్టేస్తామని  అతి విశ్వాసం ప్రదర్శించింది. కానీ అనూహ్యంగా బీజేపీతోపాటు కాంగ్రెస్‌ కూడా తెలంగాణలో సత్తా చాటగా. అది కప్పిపుచ్చుకోవడానికి మాకే ఎక్కువ సీట్లు వచ్చాయి..’ అని బుకాయించాల్సి వచ్చింది. దీంతో  టీఆర్‌ఎస్‌కి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది..

 

 

ఇకపోతే ఎన్నికల్లో చేసే ‘హద్దు మీరిన వ్యాఖ్యలు’ ప్రచారాల్లో సర్వ సాధారణమే అయినా ఒకవేళ ఆ ప్రచారమే కలిసొచ్చి, అధికార పార్టీకి షాక్‌ తగిలితే.. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయే ప్రమాదముందని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారట.

 

 

ఇక ప్రస్తుతానికి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా వున్నా.. బీజేపీ మైండ్‌ గేమ్‌కి కంగారుపడుతూ ఎదుటివారిని భ్రమకు గురిచేయాలనే ఉద్దేశ్యంతో మజ్లిస్‌ మీద నోరు పారేసుకుంటుండడంతో మజ్లిస్‌ అధినాయకత్వమూ గులాబీ పార్టీ తీరుపై గుస్సా అవుతోందట. ఒకవేళ ఈ మాటల పోరు నిజమైతే గనుక ఈ స్థానిక ఎన్నికల్లో మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌కి ముప్పు తప్పకపోవచ్చుననే గుసగుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: