తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ప్ర‌చారంలో భాగంగా డ్యాన్సులు చేశారు. పుర‌పోరులో భాగంగా, మరిపెడ మున్సిపల్‌లోని 3,4, 5, 6, 7వ వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, మానుకోట ఎంపీ మాలోత్‌ కవితతో కలిసి మంత్రి ప్రచారంలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగానే ప్ర‌జ‌ల‌తో క‌లిసి డ్యాన్సులు చేశారు. జ‌నవరి 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో మీరేసే ప్రతి ఓటు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌కే అని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు.

 


ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి రాథోడ్ కోరారు. ప్రజల స్పందన చూస్తుంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమైందన్నారు. మరిపెడ, డోర్నకల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి రెడ్యానాయక్‌కు బహుమానంగా ఇవ్వాలన్నారు. మంత్రిగా తన వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి శూన్యమే అని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎదురొస్తే పోటీ చేసిన వాళ్ల అడ్రసు ఎక్కడని అడగాలన్నారు. ఆ పార్టీ నాయకులు ఉత్తమకుమార్‌ భార్యనే గెలిపించుకోలేక పో యారని, ఇక మున్సిపాలిటీలో ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు.

 


టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుతోనే మరిపెడ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ క‌విత అన్నారు. తాను ఇక్కడే పెరిగానని గుర్తు చేసుకున్నారు. మా నాన్న రెడ్యానాయక్‌ మరిపెడను మున్సిపాలిటీ ఏర్పాటు చేయించి రూ.20కోట్ల నిధులు తెచ్చారన్నారు. ఒకప్పుడు ఒకే బంగ్లాతో ఉండే మరిపెడ నేడు వ్యాపార కేంద్రం గా విలసిల్లుతుందన్నారు.తాను మాటిస్తే తప్పేవాడిని కాదని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. పట్టణ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ నిధులతో మరిపెడను అభివృద్ధి చేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పినట్టుగానే సాగు నీళ్లు తెచ్చి ప్రజలు, రైతుల రుణం తీర్చుకున్నానన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: