పెద్దలు ఎవరు తవ్విన గోతిలో వారే పడతారని చెబుతూ ఉంటారు. పెద్దలు చెప్పిన విధంగానే నెల్లూరు జిల్లాలో భార్యను చంపటానికి ప్రయత్నించి ఒక వ్యక్తి తానే చనిపోయాడు. భార్యను ఉరి తీసి చంపుదామని ప్రయత్నించాడు కానీ ఆ వ్యక్తే ఉరితాడుకు బలయ్యాడు. పూర్తి వివరాలలోకి వెళితే నెల్లూరు జిల్లా ఇందుపూరులో చప్పల్లి శ్రీనివాసులు, రాజేశ్వరమ్మ దంపతులు నివశించేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 
 
ఇప్పటికే ఇద్దరు కూతుళ్లకు వివాహం కాగా వీరు సంతోషంగా జీవిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం శ్రీనివాసులు గ్రామంలో ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి తాను హామీ అని చెప్పి 6లక్షల రూపాయలు అప్పుగా ఇప్పించాడు. కానీ 6 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న వ్యక్తి ఊరి నుండి వెళ్లిపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి శ్రీనివాసులును డబ్బు కట్టాలని తీవ్రంగా వేధించాడు. 
 
మరోవైపు తన భార్య రాజేశ్వరమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానాన్ని శ్రీనివాసులు పెంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఈ విషయంలో కొంతకాలం నుండి గొడవలు జరుగుతున్నాయి. తన భార్యను చంపాలనే ఉద్దేశంతో శ్రీనివాసులు ఒక ప్లాన్ వేసి ఇంట్లో ఉన్న ఫ్యానుకు తాడు బిగించి ఉరి తీయాలని అనుకున్నాడు. రాజేశ్వరమ్మను ఉరి తీయడానికి ప్రయత్నించిన క్రమంలో ఆమె తన ప్రాణాలు కాపాడుకోవటానికి గట్టిగా కేకలు పెట్టింది. 
 
ఇది గమనించిన స్థానికులు రాజేశ్వరమ్మను అల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్య చికిత్స కొరకు రాజేశ్వరమ్మను నెల్లూరుకు తరలించారు. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో శ్రీనివాసులు తన మెడకు తానే ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎస్సై రఘునాథ్ కు స్థానికులు సమాచారం అందించగా రఘునాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం కొరకు నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై రఘునాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: