ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు హామీల్లో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదీన 43 లక్షల మంది లబ్ధిదారులకు అమ్మఒడి నగదు జమైంది. కొంతమంది అమ్మఒడి పథకానికి అర్హులైనప్పటికీ డబ్బులు జమ కాలేదని చెబుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారి కొరకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైనప్పటికీ అమ్మఒడి నగదు జమ కాని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 
 
జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా కొందరు లబ్ధిదారుల పేర్లు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదు అయ్యాయి. వీరికి మేలు చేకూరేలా ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ఆప్షన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 32 వేల మంది ఆధార్ నంబర్లు తప్పుగా నమోదు కావటం వలన, ఇతర కారణాల వలన అర్హులైనా నగదు జమ కాలేదు. ప్రభుత్వం నుండి అమ్మఒడి ఆర్థిక సాయం జమ కాకపోవటంతో నిరాశ చెందారు. 
 
ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తప్పులను సరి చేసేందుకు ఆప్షన్లను ఇచ్చి తప్పులు సరి చేసిన అనంతరం నగదును జమ చేయనుందని తెలుస్తోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చెప్పిన హామీలను అమలు చేస్తూ ఉండటంపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చాలామంది అమ్మఒడి ఖాతాలలో జమ అయిన నగదును విత్ డ్రా చేసుకొని సీఎం జగన్ ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు అమ్మఒడి లబ్ధిదారులకు కొందరు సైబర్ నేరగాళ్లు గ్రామ సచివాలయం నుండి ఫోన్లు చేస్తున్నామని చెప్పి వారి బ్యాంకు ఖాతాలలోని నగదును దోచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పోలీసులు అమ్మఒడి లబ్ధిదారులు సైబర్ నేరగాళ్ల మాయలో పడవద్దని ఎవరైనా బ్యాంకు నుండి లేదా గ్రామ సచివాలయం నుండి ఫోన్లు చేస్తున్నామని చెబితే ఖాతాకు, ఏటీఎం కార్డుకు సంబంధించిన వివరాలను ఎట్టి పరిస్థితులలోను చెప్పవద్దని సూచనలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: