వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో తెలంగాణ స్వరం వినిపించనుంది. స్విస్‌లోని దావోస్‌లో జరుగుతున్న సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. ఐటీ, ఫార్మా, రియల్‌, ఇండస్ట్రీస్‌ వంటి రంగాల్లో ప్రపంచ ఖ్యాతిపొందిన తెలంగాణాలో... మరిన్ని పెట్టుబడులకు కేటీఆర్‌ ప్రసంగం ఊతమివ్వనుంది. నాలుగు రోజులపాటు జరిగే సదస్సుకు కేటీఆర్‌ బయల్దేరి వెళ్లారు. 

 

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం లో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 50వ వార్షిక సదస్సు జరగనుంది. ఫోరం నుంచి కేటీఆర్‌ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 2018లో తొలిసారిగా ఆయన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. 2019లో నిర్వహించిన సదస్సుకు ఫోరం నుంచి ఆహ్వానం అందినా హాజరు కాలేకపోయారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. 

 

తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు మంత్రి కేటీఆర్‌. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కేటీఆర్‌ పత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ దిలీప్‌.. కేటీఆర్‌తో పాటు దావోస్‌కు వెళ్లారు. 

 

2018 లో దావోస్‌ పర్యటన వెళ్లిన మంత్రి కేటీఆర్‌... అప్పటి పర్యటనలో టెక్‌ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎండీ గుర్నానీలతో సమావేశమై వరంగల్‌లో ఐటీ పార్క్‌ ఏర్పాటుచేయాలని కోరారు. అది ఇటీవలే సాకారమైంది. నోవార్టీస్‌, లాకీడ్‌ మార్జిన్‌ వంటి కంపెనీల ఏర్పాటుకు సైతం పర్యటన వల్లే జరిగాయి. ఈ ఏడాది సైతం మరిన్ని కంపెనీల ఏర్పాటు, పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేటీఆర్‌ ప్రసంగం, దావోస్‌ పర్యటన ఉండనున్నట్లు పారిశ్రామికవర్గాలు భారీ అంచనాలనే పెట్టుకున్నాయి. దావోస్‌ నుంచి 24న కేటీఆర్‌ తిరిగి రానున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: