జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఏకంగా శాసనమండలినే రద్దు చేయాలని నిర్ణయించారు. మండలి రద్దుకు అవసరమైన విధి విధానాలను కూడా రెడీ చేసేశారు.  ప్రతి విషయంలోను ప్రభుత్వానికి మండలిలో చికాకుగా ఉంటోంది. ప్రతి చిన్న విషయాన్నీ టిడిపి సభ్యులు  పీకి పీకి పాకం పెడుతున్నారు.

 

మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టగా తీసుకున్న ఇంగ్లీషుమీడియా బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి మండలికి పంపారు. నిజానికి అసెంబ్లీలో పాసైపోయిన తర్వాత మండలిలో తిరస్కరించినా పెద్దగా ఉపయోగం లేదు. అయినా పనిగట్టుకుని మండలిలో బిల్లును తిప్పి పంపేశారు.  58 మంది సభ్యులున్న మండలిలో టిడిపికి మెజారిటి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

 

శాసనమండలిలో ప్రస్తుతం టిడిపికి 26, వైసిపికి 9, పిడిఎఫ్ కు 5, బిజెపికి 3, ఇండిపెండెట్ సభ్యులు 5 మంది సభ్యులున్నారు. ఎంఎల్ఏలుగా ఎన్నికైన వారు రాజీనామాలు చేయటంతో మరికొన్ని స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే టిడిపి సభ్యుడు అన్నం సతీష్ రాజీనామాతో మరో స్ధానం ఖాళీగా ఉంది.

 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన  మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం నుండి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ జరుగుతోంది.  సంఖ్యా బలం రీత్యా జగన్ ప్రతిపాదనకు అసెంబ్లీలో బిల్లు పాసైపోతుంది. కానీ మండలిలో మళ్ళీ సమస్య మొదలవుతుంది. మండలిలో గనుక బిల్లు పాస్ కాకపోతే జగన్ కు అవమానం క్రిందే లెక్క. ఒకవేళ మండలిలో బిల్లు గనుక వీగిపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అసెంబ్లీకి రావాల్సిందే. మళ్ళీ మండలికి వెళ్ళాలి.

 

అంటే బిల్లు అసెంబ్లీ-మండలి మధ్య ఫుట్ బాల్ లాగ తిరుగుతునే ఉంటుంది. నిజానికి అధికారపార్టీకి ఈ విషయం చికాకుగా  ఉంటుందనటంలో సందేహం లేదు. సరే అన్నీ కోణాల్లో ఆలోచించిన తర్వాతే శాసనమండలిని రద్దు చేసేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.

 

కాకపోతే తన తండ్రి దివంగత వైఎస్సార్ పునరుద్ధరించిన మండలిని తన హయాంలో  రద్దు చేయాలా అనే సెంటిమెంటు బాధిస్తున్నప్పటికీ తప్పని పరిస్ధితి. సోమవారం ఉదయం ప్రారంభం అయ్యే బిఏసి సమావేశంలోనే  ఈ ప్రతిపాదనను అధికారపార్టీ తీసుకువస్తుందని అనుకుంటున్నారు.  ఒకవేళ బిఏసి సమావేశంలోనే సబ్జెక్టు వస్తే మాత్రం వెంటనే శాసనమండలి రద్దుకు  అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేస్తారు. మరి వెంటనే మండలి రద్దైపోతుందా అన్నదే తేలాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: