ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాన్ మండిపోతుంటే మరోవైపు  అదే పార్టీకి చెందిన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ కే తన ఓటు అంటూ ప్రకటించారు. మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో గనుక ఓటింగ్ చేయాల్సొస్తే జగన్ ప్రతిపాదనకే తాను ఓటు వేస్తానంటూ చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది.

 

నిజానికి ఒకపుడు విశాఖపట్నం సభలో మాట్లాడుతూ  విశాఖపట్నానికే తన ఓటంటూ పవన్ ప్రకటించారు. అలాగే కర్నూలు సభలో మాట్లాడుతూ కర్నూలును రాజధానిగా చేసుకుంటానంటే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. అలాంటిది వైసిపి   అధికారంలోకి రాగానే  జగన్ చేసిన ప్రతిపాదనను పవన్ వ్యతిరేకిస్తుండటమే విచిత్రంగా ఉంది.

 

ఇదే విషయాన్ని జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ  పార్టీ స్టాండ్ ఎలాగున్నా, పవన్ కల్యాణ్ నిర్ణయం ఎలాగున్నా తాను మాత్రం వ్యక్తిగతంగా మూడు రాజధానుల కాన్సెప్టుకే అనుకూలమని ప్రకటించారు. జగన్ ప్రకటన తర్వాత క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇటు టిడిపి ప్రజా ప్రతినిధుల్లో కూడా జగన్ ప్రతిపాదనవైపే కొందరిలో మొగ్గు కనిపిస్తోంది.

 

ఎలాగంటే ఆదివారం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో టిడిఎల్పి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరవ్వాలంటూ  22 మంది ఎంఎల్ఏలకు, 26 మంది ఎంఎల్సీలను పార్టీ ఆదేశించింది. అయితే ఏడుగురు ఎంఎల్ఏలు, 12 మంది ఎంఎల్సీలు గైర్హాజరయ్యారు. స్వయంగా చంద్రబాబు వాళ్ళతో మాట్లాడి అసెంబ్లీ ముందురోజు సాయంత్రం టిడిఎల్పి సమావేశం పెడితేనే  ఇంతమంది గైర్హాజరవ్వటం చంద్రబాబుకు షాకిచ్చినట్లే.

 

గైర్హాజరైన ఏడుగురు ఎంఎల్ఏల్లో ఐదుగురు ఇప్పటికే జగన్ కు జై కొట్టారు.  అలాగే సమావేశానికి డుమ్మాకొట్టిన 12 మంది ఎంఎల్సీల్లో ఇప్పటికే నలుగురు మూడు రాజధానులకు ఓకే చెప్పారు. మరి మిగిలిన 8 మంది ఎంఎల్సీలు ఎందుకు గైర్హాజరయ్యారు ? ఓటింగ్ దాకా వస్తే ఏం చేస్తారు ? అన్నదే సస్పెన్సుగా మారింది. అందుకనే ముందు జాగ్రత్తగా చంద్రబాబు అందరికీ విప్ జారి చేశారు. మరి ఓటింగ్ దాకా వస్తే వీళ్ళంతా ఏం చేస్తారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: