అమరావతి విషయంలో ఇవాళ కీలకప్రకటన వెలువడుతున్న సమయంలో వైసీపీ సర్కారు విపక్షాలకు షాక్ ఇచ్చింది. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ సహా పలు పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేసేశారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధం చేశారు.

 

ఆదివారం రాత్రి నుంచే ఈ హౌజ్ అరెస్టులు మొదలయ్యాయి. పలు నియోజకవర్గాల్లో తెదేపా ముఖ్యనేతలు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు ముందుగానే జారీ చేశారు. అయితే ఎన్ని అరెస్టులు చేసినా అసెంబ్లీ ముట్టడి జరిగి తీరుతుందని ఈ సందర్భంగా నేతలు అంటున్నారు.

 

అంతే కాకుండా సోమవారం మండలి సమావేశాలు లేవంటూ పలువురు ఎమ్మెల్సీలను కూడా పోలీసులు హౌజ్ అరెస్టులు చేశారు. మండలి సమావేశాలకు వెళ్లడంపై పోలీసులు ఎలా నిర్దేశిస్తారని సభ్యులు అంటున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు.. శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్‌తో మాజీ ఎమ్మెల్యేలు రమణమూర్తి, వెంకటరమణమూర్తిలను హౌజ్ అరెస్టు చేశారు. సీపీఐ నేత రామకృష్ణను కూడా అరెస్టు చేశారు.

 

 

టీడీపీ సహా పలు పార్టీల నేతల గృహనిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. పోలీసు చర్యలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని ఆయన అంటున్నారు. ఇది ప్రభుత్వ పిరికపంద చర్యగా కళా అభివర్ణించారు. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని కళా వెంకట్రావు విమర్శించారు. తక్షణమే నాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

అసెంబ్లీ ముట్టడి వంటి ఆందోళనల సమయంలో ఇలా ముందస్తు అరెస్టులు చేయడం కొత్తేమీ కాదు. ఎలాంటి ఆందోళలు జరగకుండా.. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకే ఈ అరెస్టులు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ అసెంబ్లీ సమావేశాలు కీలకంగా జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: