ఏపీ రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరులో హోం మంత్రి సుచరిత ఇంటి ముట్టడికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రయత్నించారు. పోలీసులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను, ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసులు ఉద్యమంలో కీలకంగా ఉన్న 800 మందికి ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ నోటీసులు జారీ చేశారు. 
 
మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గుంటూరులో గృహ నిర్భంధంలోకి తీసుకున్నారు. సీపీఐ నేత రామకృష్ణను, బుద్ధా వెంకన్నను విజయవాడలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావును, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతి చుట్టూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు రాజధాని గ్రామాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. 
 
మరోవైపు ఏపీ కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఎజెండా విషయంలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినేట్ సమావేశంలో ఏడు అంశాల గురించి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుపై, పాలన వికేంద్రీకరణపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 4 జోన్ల ఏర్పాటు గురించి కూడా కేబినేట్ లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుపై, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లుపై కేబినేట్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. లోకాయుక్తకు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణను అప్పగించడానికి కేబినేట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. రైతు భరోసా కేంద్రాలపై, పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే నేటి నుంచి మూడు  రోజుల పాటు జరిగే ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాలలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: