పరిపాలన వికేంద్రీకరణ, 13 జిల్లాల సమ్మిళిత అభివృద్ధి కోసం ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వివరించారు. బిల్లుకు సంబంధించిన వివరాలను ఆయన సభ ముందు ఉంచారు. ఇదే సమయంలో అసలు రాజధాని ఎంపిక కోసం శివరామ కృష్ణన్ కమిటీ ఏం చెప్పింది.. చంద్రబాబు ఏం చేశారో వివరించారు.

 

మంత్రి బుగ్గన ఏమన్నారంటే.. “ ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి శివరామకృష్ణన్ కమిటీని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఎలాంటి సమస్యలు రాకుండా రాజధాని ఏర్పాటు చేయడానికి ఏ ప్రాంతమైతే బాగుంటుందో సూచించమని కేంద్రం ఆనాడు శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. దాని ప్రకారమే 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని కమిటీ కేంద్రానికి సూచించింది. ఒక్క నగరాన్ని అభివృద్ధికి ప్రోత్సహించవద్దని కమిటీ సూచించింది. పంటలు పండే భూములను నాశనం చేయవద్దని, రియల్ వ్యాపారాలకు ఆస్కారం ఇవ్వకూడదని పేర్కొంది. అమరావతిలో భారీ కట్టడాలకు ఆస్కారం ఇవ్వకూడదని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరించింది. దీంతోపాటు మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలని సూచించింది.

 

తెలంగాణ లాంటి ప్రాంతీయ అసమానతలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికార వికేంద్రీకరణ చేయాలని ప్రత్యేకంగా వివవరించింది. కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమిటీ, రవీంద్రన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల కన్నా గొప్పగా ఉండాలని మున్సిపల్ మంత్రి నారాయణ అధ్యక్షతన నారాయణ కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును కనీసం చదవకుండా.. అందుకు విరుద్ధంగా ఏదో నిగూడమైన స్వార్థంతో రాజధాని నిర్మాణానికి వెళ్లి ఉంటారని ఇన్సైడర్ ట్రేడింగ్ చూస్తే స్పష్టమవుతుంది.

 

రెండు మూడు శతాబ్దాలు గడిచినా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం శివరామకృష్ణన్ కమిటీని కనీసం పరిశీలనకు తీసుకోలేదు. తనకు అప్పగించిన రాజధాని నిర్మాన బాధ్యత కోసం క్యాన్సర్ తో బాధపడుతూనే 11 జిల్లాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కు కనీస గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు అవనమానించారు. ఆయన రిపోర్టును పరిశీలించకుండా సమాంతరంగా నారాయణ కమిటీని ఏర్పాటు చేసి తిప్పడం స్వార్థపూరితమేనని అర్థమవుతుందని మంత్రి బుగ్గన సభకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: